CM KCR | ఎండిన డొక్కలతో, అరిగిన బొక్కలతో దశాబ్దాల పాటు దుర్భర జీవితాలు అనుభవించారు చేనేత కార్మికులు. అగ్గిపెట్టెలో చీరను ఇమడ్చగల కళ సొంతమైనా… నాటి పాలకుల నిర్లక్ష్యం సాలెల మగ్గం సడుగులు ఇరిగేలా చేసింది. చేసేందుకు పనిలేక, కుటుంబాన్ని పోషించలేక తాము నేసే నూలు పోగులనే ఉరితాళ్లుగా చేసుకొని బలవన్మరణం పొందిన నేతన్నలెందరో! ఆనాటి వార్తలు కాంగ్రెస్ పాలకులు చేసిన గాయాలను నేటికీ గుర్తు చేస్తాయి.
తెలంగాణ రాకతో నేతన్నల బతుకు చిత్రం మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రగతి విధానాలు, సంక్షేమ ఫలాలు పడుగు, పేకలా మగ్గంతో జతకట్టాయి. పొట్టకూటి కోసం ఎక్కడెక్కడికో వలస పోయిన నేత కార్మికులు సొంతూళ్లకు చేరారు. ఇక్కడి ఇక్కత్ సొగసులు ఎక్కడెక్కడికో చేరాయి. నేతన్న ఆత్మగౌరవం పెరిగింది. ఆత్మహత్యలు ఆగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు నేత కుటుంబాలకు ఆదరువై తమ మగ్గాన్ని మూడు పూటలా ఆడిస్తున్నాయని చెబుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు. నాటి వెతలను, నేటి బతుకులను ‘అసలు ముచ్చట’లో ఇలా పంచుకున్నారు..
వనం సతీశ్ కుమార్ (చేనేత కార్మికుడు): తెలంగాణ రాకమునుపు ఏ నేతన్న ఇల్లు చూసినా.. దరిద్రమే కండ్లవడ్తుండే! అప్పటికీ.. ఇప్పటికీ పోలికెక్కడిది? కాంగ్రెసోళ్ల పాలనతో మన బతుకులు ఆగమాగం ఉంటుండె కదా! సాలోళ్ల ఇండ్లల్ల మగ్గమే జీవనాధారం. భర్త, భార్య, పిల్లలు అందరూ కట్టవడ్డా.. తిండికి ఎల్లకపోవు. ఆ బాధలు నా కండ్లల్ల ఇంకా మెదుల్తున్నయ్. తెలంగాణ అచ్చినంక నాలుగేల్లు నోట్లకు పోతున్నయ్. మన బతుకులు దారినవడ్డయ్.
కూరపాటి సుధాకర్: నా ముచ్చటే చూడరాదే..! ఈడ పన్లేక హైదరాబాద్ పోయిన. అపార్టుమెంట్ల వాచ్మెన్ పని చేసిన. పొద్దంత కట్టవడ్తె నెలకు నాలుగువేలు అస్తుండే. నైట్‌డ్యూటీ చేసి పానం కరాబయ్యేది. కొలువు ఆడ.. పిల్లలు ఈడ.. మనసు పీకుతుండే. కొందరు ఇంటోనర్ల మాటలకు గుండె చివుక్కుమనేది. ఇయ్యాల బాజాప్త నా ఊర్లనే ఉంటున్న. పని మస్తు దొరుకుతాంది. సావుకారు దగ్గర రంగులు అద్దుతున్న. నెలకు 20వేలు పుడ్తున్నయ్. నాలెక్క ముంబయి, భీవండీ, సూరత్ పోయినోళ్లందరు మళ్లీ ఊళ్లకొచ్చిన్రు. మగ్గాలు మంచిగాడుతున్నయ్.
సూరెపల్లి లక్ష్మమ్మ: సుధాకరు.. నా కథ నీకు తెల్వంది గాదు! మా ఆయన శాతనైతే అప్పుడో ఇప్పుడో మగ్గం నేస్తడు. పన్జేసిన పానం కదా ఏదో తండ్లాడ్తడు. ఒక్క పొర రెండు, మూడు నెలలు నేస్తడు. గట్ల పన్జేస్తే రోజులెల్తయా? కేసీఆర్ సారు మాకు నెలకు రూ.2,016 పింఛనిస్తుండు. అదేదో చేనేత మిత్ర పథకం అంట.. నెలకు అవో 2వేలు ఖాతాల వేస్తున్రు. అటీటు అంతా నాలుగు వేలదాకా సర్కారు ఇస్తున్నది. బియ్యం కూడా సర్కారే ఇయ్యవట్టే. ఒకరికింద చేయి సాచే బాధ లేకుండ రోజులెల్తున్నయ్.
జెట్ల కృష్ణస్వామి: గంతెందుకవ్వా! కరోనా టైమ్‌ల మనకు పెద్ద దెబ్బ పడ్డది. కూలీలిచ్చే సావుకారులు చేతులెత్తేసిన్రు. నేసిన చీరలన్నీ మూలన పడ్డయ్. గా టైమ్‌ల కేసీఆర్ సారే దిక్కయిండు. పొదుపు పైసలు బ్యాంకులేసిండు. నాకు లక్ష రూపాయలచ్చినయ్. పొదుపు పథకం తెల్వదానే.. నెలకు మనమింత కడితే, సర్కార్ ఇంత జమ చేస్తది! ఆ పైసలిచ్చుడుతోని కరోనా టైమ్‌ల శానమంది బయటపడ్డరు. గీ స్కీమ్ అంతకుముందెప్పుడు లేదు. కేసీఆర్ సారు తెచ్చిండు.
వనం దివ్య: సీన్మలల్ల మగ్గం ఆడించుడు చూసి మస్తు అనిపిస్తది కని, నేసుడు పని చూసినంత వీజీ కాదు. రంగులు అద్దుడు, పడుగు సాపుడు ప్రతి పనీ కష్టమే. పెట్టుబడి తక్వైతదా!! పదేండ్ల కిందట రంగులు, రసాయనాల పైసలు మొత్తం మన మీదనే పడ్తుండే. కేసీఆర్ సారు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నడు. పెట్టుబడి తగ్గుడుతోని లాభం పెరిగింది. స్వామి.. గీమధ్య ఇంకో స్కీమ్ తెచ్చిన్రు. జియో ట్యాగింగ్ ఉన్నోళ్లందరికీ ప్రతి నెలా పైసలు ఇస్తున్రు. ఖాతాలో రూ.2వేల వరకు పడ్తున్నయి. నాక్కూడా రూ.500 వస్తున్నయ్. చేనేత మగ్గం పథకం కొత్తగ షురువైంది. ఇప్పుడున్న గుంట మగ్గాలు పక్కనబెట్టి.. ఫ్రేమ్ ఇస్తున్రు.
గొట్టిముక్కల ఆండాలు: అవ్ బిడ్డా.. కేసీఆర్ దేవుడు. మా కుటుంబమంతా ఆయనకు రుణపడి ఉంటది. నాకొక్కడే కొడుకు. రైలు కిందపడి ఆడి రెండు కాళ్లు పోయినయి. అయినా అట్లనో ఇట్లనో బతుకుతుంటిమి. ఎందుకో దేవుడికి మా మీద కోపం. ఆరు నెలల్లో ముగ్గురు పెద్ద దిక్కులను పోగొట్టుకున్నం. మా ఆయన పోయిన కొన్ని రోజులకే మా కోడలు అమ్మ పోయింది. కొన్నొద్దులకే మా కొడుకు గుండెపోటుతో కాలం చేసిండు. వాడికి ఇద్దరు ఆడబిడ్డలే. ఉండనీకి ఇల్లు లేదు. తిననీకి తిండి లేదు. ఈ బాధ చూడలేక.. ఎట్ల బత్కాల్నో తెల్వక.. నేను, మా కోడలు, ఆడబిడ్డలు అందరం సద్దామనుకున్నం. కానీ, నేత కార్మికుడు సచ్చిపోతే చేనేత బీమా ఇస్తరని ఊర్లోళ్లు చెప్పిన్రు. నా బిడ్డ పోయిన పది రోజులకే ఐదు లచ్చలొచ్చినయ్. ఆ పైసలతోని అప్పులు తీరినయ్. ఆడబిడ్డల పేరు మీద చెరో లచ్చ బ్యాంకులేసినం. ఇయ్యాల మేమంతా బతికున్నమంటే అందుకు కారణం కేసీఆర్ సారే!
మంత్రి సత్యనారాయణ: ఇన్నొద్దులూ మన గురించి ఎవరన్న ఆలోచించిన్రా అమ్మా! దేశంల ఇంకెక్కడన్న గిసొంటి స్కీమ్లున్నయా?! కేసీఆర్ సారు మనకోసం గింత చేస్తుంటే.. కేంద్రంలున్న బీజేపోల్లు మన మీద పగవట్టిన్రు. ఇప్పుడిప్పుడే మంచిగ బత్కుతున్నంరా నాయనా అంటే.. చేనేత మీద జీఎస్టీ ఏస్తరంట! ఎన్నడన్న.. ఎప్పుడన్న ఉన్నదా ఇట్ల? మనకు సాయం చేసుడుపోయి.. మనకాడ్నే గుంజుకునే ఉపాయం చేస్తున్రు. ఇట్లాంటోళ్లకు కర్రుకాల్చి వాత వెట్టాలే.
వనం సతీష్ కుమార్: గా పువ్వుపార్టీ ఊళ్లల్ల ఇప్పట్ల రాదు గని, కాంగ్రెసోళ్లను నమ్మొద్దన్నా! ఇన్నేండ్లు పాలించి.. మనల్ని ఆగజేసింది ఆళ్లే కదా! ‘మీకిది చేస్తమ’ని కూడా చెప్తలే! సెప్పినా చేస్తరన్న గ్యారెంటీ లేదు. అసోంటోళ్లను నమ్మితే చేజేతులా మన బతుకులను ఆగం చేస్కున్నట్టే! పదేండ్లు ఎన్కకు పోయినట్టే!! కేసీఆర్ సార్ ఇప్పట్కే చేతల సర్కారు.. చేనేతల సర్కారు అని నిరూపించుకుండు. నేతన్న గోడు పట్టించుకున్న కేసీఆర్ సారే మన నేత.
… పున్న శ్రీకాంత్