Election Betting | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : మొన్నటిదాకా తమ అంచనాలే నిజమవుతాయని బలంగా నమ్మిన బెట్టింగ్బాబులను ఎగ్జిట్‌పోల్స్ అయోమయంలో పడేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై కొందరు.. కాంగ్రెస్‌పై కొందరు.. ఏపీలో వైసీపీ గెలుస్తుందని కొందరు.. కూటమి వస్తుందని కొందరు బెట్టింగ్ కాచేలోపే వారి ఆలోచనలను ఎగ్జిట్‌పోల్స్ తారుమారు చేశాయి. ముఖ్యంగా 400కు పైగా సీట్లు వస్తాయని ఆశించిన బీజేపీకి, 250 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని తేలడంతో ఈ పార్టీపై పందెంకాయాలనుకున్నవాళ్లు పునరాలోచనలో పడ్డారు. ఇక కాంగ్రెస్‌కు 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని సర్వే సంస్థలు ఝలక్ ఇవ్వడంతో ఆ పార్టీ అభిమానులు బెట్టుకట్టాలంటనే భయపడుతున్నారు.
అంతాతూచ్.. మళ్లీ పందెం!
ఆంధ్రప్రదేశ్‌లోనూ విభిన్న అంచనాలు ఎదురవడం పందెంరాయుళ్లకు మింగుడుపడటం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీగా ఆశలు పెట్టుకున్న బెట్టింగ్‌బాబులు, ఎగ్జిట్‌పోల్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు. కొన్ని సంస్థలు కూటమికి పట్టంగట్టడం, మరికొన్ని వైసీపీ వైపు మొగ్గడంతో ఎటువైపు బెట్టుకట్టాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇప్పటికే తమ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్కట్టిన వాళ్లంతా ఎగ్జిట్‌పోల్స్ చూశాక తెల్లమొహం వేస్తున్నారు.
ఒకానొక దశలో ‘అంతా తూచ్.. మళ్లీ మొదట్నుంచి పందెం వేద్దాం’ అని బతిమాలుకుంటున్నారని సమాచారం. నియోజకవర్గాలవారీగా ఫలానా పార్టీ వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుస్తాడని బలంగా అనుకుంటున్నవారు మొదటకాసిన పందేనికే కట్టుబడి ఉంటున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో బెట్టంగ్తో నష్టపోయినవాళ్లు ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆచితూచి పందేనికి దిగారని సమాచారం.
గత ఎన్నికల్లో డబ్బు పోగొట్టుకున్నవాళ్లంతా ఈసారి ఎగ్జిట్‌పోల్స్ తర్వాత భారీగానే బెట్టింగ్కాశారని వినికిడి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఏపీలో భారీగా బెట్టింగ్‌లు పెట్టినట్టే, ఏపీలో అసెంబ్లీ ఫలితాలపై తెలంగాణలోనూ భారీగా పందెంకాశారు. ఎక్కవమంది జగనే మళ్లీ అధికారం చేపడుతారనే నమ్మకంతో బెట్టుకట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
మొత్తంగా అటు లోక్‌సభ ఎన్నికలు, ఇటు తెలంగాణ పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల పేరిట నడిచే బెట్టింగ్ అనే వికృతక్రీడలో నేటి సాయంత్రంలోగా కోట్లాది రూపాయల చేతులుమారనున్నట్లు పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి. బెట్టింగ్పేరిట ఎంతోమంది ఆర్థికంగా నష్టపోతున్నారని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, వాటని కట్టలేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అనవసరంగా బెట్టింగ్‌కు పోయి కుటుంబాలను రోడ్డునపడేసుకోవద్దని పోలీసులు, ప్రముఖులు సూచిస్తున్నారు.