హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఏ పల్లెకు పోయినా అందమైన సీసీ రోడ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారగా, సీసీ రోడ్లు వాటికి అదనపు హంగులను అద్దాయి. స్వరాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ సర్కారు పెద్ద పీట వేసింది. గ్రామాల్లో ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చేసింది. ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో తెలంగాణలోని పల్లెల్లో రూ.369 కోట్లతో 1,231 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత డిసెంబర్ వరకు రూ.3,062 కోట్లతో 9,117 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు పూర్తయ్యాయి. తాజాగా రూ.1,359 కోట్లతో 17,259 సీసీ రోడ్ల పనులకు మంజూరు ఇచ్చారు.
రూ.85 కోట్ల విలువైన 1,075 పనులు పూర్తి చేశారు. కాగా, ఉపాధి హామీ నిధులను విడుదల చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో పనుల్లో ఆలస్యం జరుగుతున్నది. దీంతో మార్చి చివరి నాటికి పూర్తి చేయగలిగే పనులను అంచనా వేసి వాటిని మాత్రమే చేపట్టాలని, మిగిలిన పనులను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మొదలుపెట్టాలని జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించారు. అదే సమయంలో ఆయా జిల్లాల్లో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులను అంచనా వేసి, ఆ నిధులకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. పనులు పూర్తయ్యాక బిల్లులు రావడంలో ఆలస్యం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రకమైన ప్రణాళికను రూపొందించినట్టు అధికారులు వెల్లడించారు.