చిక్కడపల్లి, ఆగస్టు10: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాడుదామని పలువురు బీసీ నేతలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను కచ్చితంగా అమలు చేయాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. బీసీ జనసభ, హిందూ బీసీ మహాసభ, సోషల్ జస్టిస్ పార్టీ, ఆలిండియా ఓబీసీ జాక్ తదితర బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమగ్ర కుల జనగణన, స్థానక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం శనివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బీసీల సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.
బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యం చూపుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలకు వ్యతిరేకంగా పోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు.
బీసీల లెక్కలు తీస్తే రాజ్యాధికారం వారికే పోతుందని పాలకుల్లో భయం పట్టుకుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. కాంగ్రెస్ హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తనకు సీఎం కంటే బీసీలే ముఖ్యమని, అవసరమైతే బీసీల కోసం పదవులు త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి ఉండాలని కోరారు.
కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమగ్ర కుల జనగణన చెపట్టాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాడాలని మాజీ ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. సాయంత్రం రాజారాం యాదవ్, మాజీ మత్రి శ్రీనివాస్‌గౌడ్, ఇతర బీసీ నేతలకు ఆర్ కృష్ణయ్య నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు డాక్టర్ వినయ్‌కుమార్, జస్టిస్ చంద్రకుమార్, జాజుల శ్రీనివాస్‌గౌడ్, జూలూరి గౌరీశంకర్, ముఠా జయసింహ తదితరలు హాజరయ్యారు.