హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రూ.7వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయని వివరించారు. విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, సత్వరమే ఆ నిధులను విడుదల చేయాలని కోరారు. భట్టిని కలిసిన వారిలో బీసీ సంఘాల నేతల్లో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, అంజి, రాజేందర్, వేముల రామకృష్ణ, రఘుపతి, పర్వతాలు తదితరులు ఉన్నారు.