హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): డిజిటల్ రంగంలోని అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, ఉన్నతస్థానాలకు చేరుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు పిలుపునిచ్చారు. ఆ దిశగా బీసీ గురుకుల విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ విధానంలో పురోగతి సాధించేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
వర్గల్‌లోని మహిళా డిగ్రీ కళాశాలకు ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ 20 ల్యాప్‌టాప్‌లను వితరణ చేసి డిజిటల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా విద్యార్థులతో యూత్ ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ ల్యాబ్‌ను సెక్రటరీ సైదులు, ప్యూర్ సంస్థ సీఈవో డాక్టర్ శైలా తాల్లూరితో కలిసి శనివారం ప్రారంభించారు. ప్యూర్ సంస్థ ప్రతినిధులను సైదులు ప్రత్యేకంగా అభినందించారు.