హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది అగ్నిమాపక శాఖ. జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా 229 ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, మల్టీఫ్లెక్స్ మాల్స్, సినిమాహాళ్లు, ఫంక్షన్‌హాళ్లు, దవాఖానలు, పెట్రోల్ బంకులు, అపార్ట్మెంట్లు, నివాస, వాణిజ్య సముదాయాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ చేపట్టారు. ఇదిలా ఉండగా, వర్షాకాలంలో రెస్క్యూ కోసం ఏర్పాటు చేసిన బృందాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నీళ్లలో ప్రాక్టీస్ చేశాయని అగ్నిమాపకశాఖ వెల్లడించింది.