కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలం మొలచింతపల్లిలో దారుణం జరిగింది. ఓ చెంచు మహిళపై ఇద్దరు విచణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈశ్వరమ్మ, ఆమె భర్త ఈదన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలంలోనే వారిద్దరు కూలీ పని చేయిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తలు గొడవపడటంతో ఈశ్వరమ్మ తన తల్లిగారి ఊరు చుక్కాయపల్లికి వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంకటేశ్.. తల్లిగారి ఇంటి నుంచి ఈశ్వరమ్మను మొలచింతపల్లి గ్రామానికి తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు. తన భార్య శివమ్మ, బాధితురాలి బంధువు లక్ష్మమ్మ భర్త లింగస్వామితో కలిసి వెంకటేశ్ ఆమెపై దాడి చేశాడు.
పది రోజుల కిందట ఈ దాడి జరగగా శరీరంపై కాల్చిన గాయాలున్నాయి. అప్పటి నుంచి ఆమెను ఇంట్లోనే ఉంచి గ్రామంలోని ఓ ఆర్ఎంపీతో వైద్యం అందించారు. అయితే విషయం తెలుసుకున్న ఈదన్న.. గ్రామస్థులతో కలిసి ఈదమ్మను పంపించమని కోరగా వెంకటేశ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెళ్లి బాధితురాలిని ఇంటికి తీసుకొని రాగా దాష్టీకం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న నేషనల్ ఆదివాసి లిబర్టీ కౌన్సిల్ సంస్థ (ఎన్ఏఎస్సీ) సభ్యులు బుధవారం ఆమె ఇంటికి వెళ్లగా జరిగిన విషయం వారికి చెప్పింది. దీంతో వారు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ ఆదేశాలతో ఎస్ఐ రిషికేశ్, జిల్లా సఖి కేంద్రం నుంచి సరిత, అనిత గ్రామానికి వెళ్లి విచారించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం కొల్లాపూర్ దవాఖానకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నాగర్కర్నూల్ జనరల్ హాస్పిటల్కు తరలించినట్లు సఖి సభ్యులు తెలిపారు.