హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ముందుగా ఊహించినట్టుగానే పదోతరగతి ప్రశ్నపత్రాలపై సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. 11 పేపర్లకు బదులు ఆరుపేపర్లకే పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షా సమయాన్ని అరగంట పెంచారు. ఇదివరకు ఒక్కోపేపర్‌కు పరీక్షా సమయం 2:45 గంటలుండగా, తాజాగా 3 :15 గంటల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు.
మార్కుల విధానంలో ఎలాంటి మార్పులు లేవు. 80 మార్కులకు వార్షిక పరీక్షలు, 20 మార్కులకు ఇంటర్నల్స్ నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్ట్‌లకు ఒకే సమాధాన పత్రాన్ని ఇవ్వనుండగా, ఒక్క సైన్స్ పేపర్‌కు మాత్రం రెండు జవాబు పత్రాలిస్తారు. 2023 మార్చిలో జరిగే ఈ పరీక్షలకు డిసెంబర్లో షెడ్యూల్ ప్రకటించనున్నారు. 9వ తరగతి పరీక్షలకు, ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలకు కూడా ఆరు పేపర్లే ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.