చిక్కడపల్లి, అక్టోబర్ 13: అరుణోదయ కళాకారిణి విమలక్కకు సుద్దాల హనుమంతు- జానకమ్మ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆమెను అవార్డు, ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు.
ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీ రాధారాణి, ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి, రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్తేజ, ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షుడు చింతకింది కాశీం, ప్రముఖ రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. సిటీ కాలేజీ తెలుగు శాఖ అధ్యక్షుడు కోయి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మోదుగు పూలు సంపాదకులు భూపతి వెంకటేశ్వర్లు, రచ్చభారతి, సుద్దాల ప్రభాకర్, బల్ల కౌముది, లాలిత్య, స్వప్న సుద్దాల, అందె భాస్కర్ పాల్గొన్నారు.