హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): అటవీ ఉద్యోగుల భద్రత, రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. అటవీ సిబ్బందికి ఆయుధాలు, ఫారెస్ట్స్టేషన్ల ఏర్పాటు, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తదితర అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. ఉద్యోగుల కొత్త నియామకాలు, వాహనాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, త్వరగా ఆమోదం పొందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. శనివారం అటవీ ఉద్యోగులతో పీసీసీఎఫ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు అన్నింటితో ఒకసారి చర్చించిన పీసీసీఎఫ్, సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా క్షేత్రస్థాయి సమస్యలపై మరోసారి అన్నిస్థాయిల ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య తర్వాత రాష్ట్రప్రభుత్వం అన్ని స్థాయిల్లో వేగంగా స్పందించి ఆయన కుటుంబానికి అండగా నిలవడంతోపాటు, అటవీ సిబ్బందికి నైతిక మద్దతు ప్రకటించిందని డోబ్రియాల్ చెప్పారు.
ఎఫ్ఆర్వో కుటుంబానికి తక్షణ ప్యాకేజీ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు పీసీసీఎఫ్ కృతజ్జతలు తెలిపారు. అటవీ ఉద్యోగుల భద్రత, రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం మరోసారి స్పష్టంచేశారన్నారు. సిబ్బందికి ఆయుధాలు సమకూర్చాలని, ఒక్కోదాంట్లో 18 సిబ్బంది చొప్పున 30 అటవీస్టేషన్లను తొలి దశలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించామని.. వాటికి త్వరగా ఆమోదం లభించేలా చూస్తామని డోబ్రియాల్ పేర్కొన్నారు. పోడు సమస్య పరిషారానికి ప్రభుత్వం ప్రాధాన్యక్రమంలో కృషి చేస్తున్నందున, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం సంబంధిత ప్రక్రియలో అటవీ శాఖ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. అడవులకు నష్టం కలిగేలా, సిబ్బందికి హాని కలిగించేలా ఎవరు వ్యవహరించినా చట్టపరిధిలో చర్యలతోపాటు, ప్రభు త్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.