హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : సుదీర్ఘ నీరీక్షణ.. ఎడతెగని పోరాటం ఫలించింది. 13 ఏండ్ల తర్వాత సర్కారి కొలువు అందివచ్చింది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఎట్టకేలకు విద్యాశాఖ ఉద్యోగాలిచ్చింది. 1,382 మంది అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలిచ్చింది. శనివారం జిల్లాలవారీగా కౌన్సెలింగ్ నిర్వహించి, నియామకపత్రాలు, పోస్టింగ్స్ అందజేశారు.
ఒక జిల్లా వారిని, మరో జిల్లా జాబితాలో చూపించినట్టు అభ్యర్థులు ఆరోపించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 182 మంది అభ్యర్థులున్నారు. కొత్త జిల్లాల ప్రకారం సిద్దిపేట 84, సంగారెడ్డి 64, మెదక్ 34 మంది చొప్పున ఉన్నారు. అయితే శనివారం 50 పోస్టులను నింపారు. మరో 34 మందిని సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కేటాయించినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
గతంలో పాత జిల్లాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలిప్పుడు కొత్త జిల్లాల్లో అంతర్భాగమయ్యాయి. ఆయా ప్రాంతాలకు చెందినవారిని పాత జిల్లాల్లో చూపించినట్టు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సిద్దిపేటలో కలిశాయి. కలిసిన ప్రాంతాల అభ్యర్థులను కొత్త జిల్లాలకు బదులు పాత జిల్లాలకు కేటాయించారని ఆరోపించారు.