హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎమ్మెస్సీ నర్సింగ్ చేయాలని ఆశపడుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు తమకు ఆ అవకాశం ఇవ్వడం లేదని ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు వాపోతున్నారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రస్తుతం ఎమ్మెస్సీ నర్సింగ్ అడ్మిషన్లను మెరిట్ ప్రతిపాదికన నిర్వహిస్తున్నది. సోమాజిగూడలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 12 సీట్లను ఇన్సర్వీస్ కోటా కింద నర్సింగ్ ఆఫీసర్లకు కేటాయించారు. ఇందులో ఒక సీటు ప్రైవేట్ స్పాన్సర్డ్ సీటు. అంటే.. 11 సీట్లను మాత్రమే వర్కింగ్ నర్సులకు కేటాయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11వేల మందికిపైగా ప్రభుత్వ నర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపు 6-7 వేల మంది బీఎస్సీ నర్సింగ్ చేసినవారు ఉంటారని అంచనా. అందరికీ కలిపి కేవలం 11 సీట్లు కేటాయించడంతో తాము నష్టపోతున్నామని వర్కింగ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంట్రెన్స్ ఆధారంగా అడ్మిషన్లు చేపడితే అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు. ఇధ్డయన్ నర్సింగ్ కౌన్సిల్ కూడా ఇదే సూచిస్తున్నది. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాలని కోరుతూ హెల్త్ సెక్రటరీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ, డీఎంఈకి వినతిపత్రాలు సమర్పించినట్టు చెబుతున్నారు.