హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కేరళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో రాష్ట్రంలోనూ తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను(టాస్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర గ్రూప్-1 అధికారుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత నేపథ్యంలో ప్రతిభావంతులైన గ్రూప్-1 అధికారులను కార్పొరేషన్ ఎండీలు, అదనపు కలెక్టర్లుగా నియమించాలని డిమాండ్ చేసింది. గ్రూప్-1 అధికారుల అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంతునాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై అధ్యయనానికి 2015లోనే ఆరుగురు ఐఏఎస్‌లతో కమిటీ వేశారని, ఈ కమిటీ ఇప్పటివరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేదన్నారు. తమ సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి విన్నవిస్తామన్నారు. సమావేశంలో అధికారులు వేణుమాధవ్‌రెడ్డి, సయ్యద్ యాసిస్ ఖురేషి, అలోక్‌కుమార్, అంజన్‌రావు, అజయ్, భవాని, శశిశ్రీ, పద్మజారాణి, వినయ్, సోమశేఖర్, నూతనకంటి వెంకట్, శరత్చంద్ర, శ్రీరామ్, వినోద్‌రెడ్డి, షబానా, మైత్రిప్రియ పాల్గొన్నారు.