తెలంగాణలో ఆంధ్రా పోలీసులు మళ్లీ రెచ్చిపోయారు. తెలంగాణ బిడ్డపై దాష్టీకం ప్రదర్శించారు. ప్రశ్నించిన స్థానికులపై దౌర్జన్యం ప్రదర్శించారు. తన భర్తను అరెస్టు చేయొద్దని అల్లుకొని ఆర్తనాదాలు పెడుతున్న ఆడబిడ్డపై అనుచితంగా ప్రవర్తించారు. రాత్రికిరాత్రే మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్టుల పేరిట జర్నలిస్ట్ కేవీఆర్‌ను అపహరించుకుపోయారు. ఆంధ్రా పోలీసుల అరాచకంపై, దానికి మన తెలంగాణ పోలీసుల సహకారంపై తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్‌లో మహబూబ్‌నగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు కేవీఆర్ (కే వెంకట్రామ్రెడ్డి) దంపతులు నివాసం ఉంటున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై, సర్కార్ పెద్దలపై విమర్శనాత్మక కథనాలు ఇచ్చారని, తదితర కారణాలతో కేవీఆర్‌ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. విజయనగర్ జిల్లా బొబ్బిలి పోలీసుల బృందం మఫ్టీలో, ఓ ప్రైవేట్ వాహనంలో కేవీఆర్ నివాసానికి మంగళవారం అర్ధరాత్రి సమయంలో వచ్చారు.
వచ్చీరాగానే కేవీఆర్‌ను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా, అతని భార్య విజయలక్ష్మి, చిన్నారులైన వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు అరెస్టు చేయొద్దని వేడుకొన్నారు. విజయలక్ష్మి తన భర్తను పట్టుకొని ఆర్తనాదాలు పెడుతుండగా, మగ పోలీసులు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ బలవంతంగా ఈడ్చి పడేశారు. చిన్నారులైన వారి పిల్లల ఎదుటే ఈ ఘటన చోటుచేసుకొన్నది. అనంతరం స్థానిక పోలీసుల అనుమతితో బలవంతంగా బొబ్బిలి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు తెలిసింది.
కేవీఆర్‌ను అరెస్టు చేస్తుండగా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు కేవీఆర్‌ను తీసుకెళ్తున్నారు? అంటూ పోలీసుల దాష్టీకాన్ని స్థానికులు కొందరు ప్రశ్నించారు. అన్నీ నోటీస్‌లో ఇచ్చాము చూసుకోండి.. అంటూ కారులో దౌర్జన్యంగా కేవీఆర్‌ను తీసుకెళ్లారు. ఈ ఘటనను స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పోలీసుల దౌర్జన్యం చూపిన తెలంగాణ వాదులు, జర్నలిస్టులు నివ్వెరపోయారు.
ఇది నిజంగా మానవహక్కుల హననమేనని పలువురు మండిపడుతున్నారు. పాలమూరు జిల్లా బిడ్డను అరెస్టు చేసి ఆంధ్రా పోలీసులు అక్రమంగా అపహరించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏంచేస్తున్నారు? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పోలీసులు, ప్రభుత్వ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఏపీ రెడ్‌బుక్ రాజ్యాంగం తెలంగాణలోనూ అమలవుతున్నదని మండిపడుతున్నారు. గతంలో కూడా ఒకసారి కేవీఆర్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లి ఏపీ పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
జర్నలిస్టు కేవీఆర్ అరెస్టు సమయంలో ఆయన భార్య విజయలక్ష్మిపై ఏపీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఏపీ నుంచి వచ్చిన ఆ పోలీస్ బృందంలో ఒక్క మహిళా పోలీస్ కూడా లేకపోవడం గమనార్హం. మహిళా పోలీసులు లేకుండానే అరెస్టుకు పాల్పడ్డారు. కేవీఆర్‌ను అరెస్టు చేయొద్దని వేడుకొంటున్న విజయలక్ష్మిని బలవంతంగా చేతులు పట్టుకొని గుంజుతూ, ఆమె నడుమును పట్టుకొని అనుచితంగా మగ పోలీసులే పక్కకు లాగారు. అలాంటి సమయాల్లో మహిళా పోలీసుల సహకారం తీసుకోవాలన్న సోయి కూడా లేకుండా.. బలవంతంగా ఆమెను పక్కకు లాగి కేవీఆర్‌ను తీసుకెళ్లారు. ఈ ఘటనపై తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. విజయలక్ష్మి పెట్టిన హాహాకారాలు.. వీడియో చూస్తున్నవారి మనసును కలచివేశాయి. సివిల్ డ్రెస్సుల్లో వచ్చిన వ్యక్తులు తన భర్తను అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్లారని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేవీఆర్ భార్య విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.
జర్నలిస్టు కేవీఆర్ దంపతులను ఏపీ పోలీసులు మందుగా సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారి అనుమతితో కేవీఆర్‌ను తీసుకెళ్తున్నట్టగా అక్కడి వీడియోలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో తన భర్తను అక్రమంగా అరెస్టు చేయొద్దంటూ విజయలక్ష్మి ఆర్తనాదాలు పెడుతుంటే ఇదే పోలీస్‌స్టేషన్ మహిళా సిబ్బంది ఆమెను బలవంతంగా పట్టుకోగా, కేవీఆర్‌ను ఏపీ పోలీసులు లాక్కెళ్లి తమ కారులో తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుట విజయలక్ష్మి ఆర్తనాదాలు పెడుతుంటే చుట్టూరా ఉన్న పోలీసుల్లో కనికరం లేకుండా పోయిందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని మన పోలీసులు ఎందుకు వారించలేదు? అని ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రభుత్వంపైనా, ఇక్కడి పోలీసులపైనా దుమ్మెత్తి పోస్తున్నారు.
కేవీఆర్ అరెస్టు వార్తలు కలకలం రేపిన గంటల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘ప్రశ్న’ రావణ్ అనే యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. తెలంగాణలో ఉంటూ ఆయన యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు. ఇటీవల ఏలూరులో జరిగిన ఒక దళిత క్రైస్తవుల బహిరంగ సభలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు (బొజ్జా కుమార్) ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు రావణ్‌పై బీఎన్ఎస్ 196, 352, 356, ఐటీ చట్టం 66 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని పిఠాపురం తరలించారు.
తెలంగాణలో ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డుకోవాలని, జర్నలిస్టు కేవీఆర్ అక్రమ కిడ్నాప్‌ను నిలువరించాలని, బాడంగి ఎస్సై తారకేశ్వరరావుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మానవ హక్కుల ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యూనిఫామ్‌లో రాకుండా, గుర్తింపు కార్డులు లేకుండా, ప్రైవేట్ వాహనాల్లో వచ్చి సరూర్ నగర్లో కేవీఆర్‌ను అపహరించుకుపోయారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా పోలీసులు లేకుండా అర్ధరాత్రి కేవీఆర్ భార్య పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఏపీ పోలీసుల అక్రమ ఆపరేషన్‌పై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టాలని కోరారు. జర్నలిస్ట్ కేవీఆర్ కుటుంబానికి తక్షణం రక్షణ కల్పించాలని కోరారు. రామారావు ఇమ్మానేని ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది.