ఏ రాష్ట్రంలోనైనా కొంటున్నారా

- అవగాహన లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి
- జోకర్లు, బఫూన్లలా బీజేపీ నేతలు
- ప్రతిగింజనూ కొంటున్నాం
- దమ్ముంటే ఒక్కప్రాజెక్టుకైనా జాతీయహోదా తెప్పించండి
- రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయం మీద, రైతు పండించిన పంటల మీద బీజేపీ నేతలు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతూ జోకర్లు, బఫూన్లుగా వ్యవహరిస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా పథకాల గురించి తెలియకపోతే నోర్లుమూసుకుని కూర్చుంటే మంచిదని హెచ్చరించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోయిలేని మాటలు ఇకనైనా బంద్‌చేయాలని హితవు పలికారు. రైతుబిడ్డగా, రైతుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలుచేస్తున్నారని గుర్తుచేశారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసిందని పల్లా తెలిపారు. తెలంగాణలో కాళేశ్వరం, సీతారామా ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంతో ఇవ్వాళ 1.45 కోట్ల ఎకరాల భూమి మాగాణంగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, దార్శనికతతో వానకాలం, యాసంగిలో రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా దేశంలో మరే రాష్ట్రంలోకానీ, బీజేపీ పాలితరాష్ర్టాల్లో కానీ కొనుగోలుచేయని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుచేస్తున్నామని పేర్కొన్నారు. దాదాపు యాభైశాతం మంది అధికారులు, హమాలీలకు కరోనా సోకినా.. రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాస్తవ పరిస్థితులు ఏమిటీ? అనే విషయాలను రైతాంగం అర్ధం చేసుకొని సహకరిస్తుంటే కొంతమంది బీజేపీ నాయకులు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకొనేందుకు, ధైర్యం నింపేందుకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేస్తున్నారని కొనియాడారు. గాంధీ, ఎంజీఎం దవాఖానల్లోని కొవిడ్ వార్డుల్లో కలియదిరిగి వైరస్ బాధితుల్లో ‘నేనున్నాననే’ ధైర్యాన్ని నింపిన మానవీయ సీఎం కేసీఆర్ అని చెప్పారు. బండి సంజయ్‌తోపాటు, బీజేపీ నాయకులకు ఇవేవీ కనిపించటంలేదని.. కండ్లుండీ చూడలేని కబోదులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. నోరున్నది కదా అని ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ఇష్టారీతిగా మాట్లాడితే సహించబోమని.. నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. బండి సంజయ్ సహ నలుగురు బీజేపీ ఎంపీలకు దమ్మూ.. ధైర్యం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి కాళేశ్వరం, సీతారామ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్లో దేనికైనా జాతీయహోదా ఇప్పించాలని డిమాండ్‌చేశారు. తెలంగాణకు ఒక్కమెడికల్ కాలేజీ అయినా తీసుకురావాలని, విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన వర్సిటీని ఏర్పాటుచేయించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు 72శాతం పూర్తి: మారెడ్డి
యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నామని పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే రికార్డుస్థాయిలో 72 శాతం ధాన్యం కొనుగోళ్లు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని, ఇందుకోసం పౌర సరఫరాల కార్పొరేషన్‌కు రూ.20వేల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 8.50లక్షల మంది రైతుల నుంచి 58లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేశామని వివరించారు. ప్రతిరోజూ 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ధాన్యం కొనుగోళ్లల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకొంటున్నామని వివరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల్ని తప్పుదారి పట్టించేందుకు కొంతమంది నాయకులు పనికట్టుగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

