Anganwadi Center | వికారాబాద్, జూలై 11: అది ఓ మరుగుదొడ్డి. కాదు.. కాదు.. అంగన్వాడీ కేంద్రం. ఇందులో ఏది కరెక్టబ్బా అనుకుంటున్నారా? రెండూ నిజమే! అంగన్వాడీ కేంద్రానికి భవనం లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న మరుగుదొడ్డిలోనే కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ దయనీయ పరిస్థితి ఎక్కడో ఉన్నది కాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలోనిది. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లికి 4 కి.మీ. దూరంలో ఉన్న అనుబంధ తండా టేకులబీడులో ఒకేఒక్క పాఠశాల ఉంది.
ఆ పాఠశాలలో ఒకే తరగతి గది ఉంది. అందులో 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ స్కూల్ ప్రాంగణంలోనే కొన్నేండ్లుగా అంగన్వాడీ కేంద్రం కొనసాగింది. దీంతో అటు పాఠశాలకు, ఇటు అంగన్వాడీకి తరచూ ఇబ్బందులు తలెత్తడంతో.. అంగన్వాడీ భవనం ఏర్పాటు చేయాలని పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారులు స్పందించడం లేదు.
చేసేదిలేక కొన్ని నెలల కింద అంగన్వాడీ కేంద్రాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్డిలోకి మార్చారు. ఇంత చిన్న గదిలో దాదాపు 10 మంది చిన్నారులు, అంగన్వాడీ టీచర్ కూర్చునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అక్కడే తయారు చేయాల్సి వస్తున్నదని, కొత్త భవనం మంజూరు చేయాలని అంగన్వాడీ టీచర్ సోనీబాయి వేడుకుంటున్నది.