సికింద్రాబాద్,డిసెంబర్24 : ఆంధ్రా ఫిల్మ్ ఇండస్ట్రీ తక్షణమే వైజాగ్‌కు తరలిపోవాలని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్‌కుమార్ సహా తెలంగాణకు చెందిన వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని వినోద్‌కుమార్ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. 1956 నుంచి తెలంగాణ సినిమా ఇండస్ట్రీని ఆంధ్రా సినిమా ఇండస్ట్రీ దోపిడీ చేసి లక్షలాది కోట్లు సంపాదించిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చి 11 ఏండ్లు గడిచినా ఇకడే పరాన్నజీవుల్లా తిష్టవేసి, తెలంగాణ కళాకారులు, సినీరంగంలోని ఇతర విభాగాల వారి అవకాశలను ఆంధ్రా సినిమా ఇండస్ట్రీవారు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాజధాని గడువు తీరినా, ఏంపీ సీఎం, డిప్యూటీ సీఎం ఆంధ్రా ప్రాంతానికి తరలిరావాలని పిలిచినా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. సంధ్య థియేటర్లో ఆంధ్రా నటుడు అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ కారణంగానే రేవతి బలైందని ఆరోపించారు. ఆంధ్రా నటులు, ఇతర రంగాల వారు సత్వరమే ఆంధ్రా వెళ్లకపోతే యావత్ తెలంగాణ సమాజం యుద్ధం ప్రకటిస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో గాలి వినోద్‌కుమార్‌తోపాటు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కస్తూరి శ్రీనివాస్, తెలంగాణ సినీ మ్యుజీషియన్ యూనియన్ అధ్యక్షుడు రమణ ఓగేటి, చిత్రపురి సాధన సమితి జనరల్ సెక్రటరీ డాక్టర్ భద్ర, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్, డైరెక్టర్ జీజే రాజా, కేఎస్ రెడ్డి స్టూడియో అధినేత శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.