రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహిస్తున్న 13వ ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్‌లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే ఇక్కత్ చీరలను ప్రదర్శించారు. వివిద దేశాల నుంచి హాజరైన ప్రముఖులు అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను ఆసక్తిగా తిలకించారు. సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేయడం గర్వంగా ఉన్నదని నల్ల విజయ్‌కుమార్ తెలిపారు. అగ్గిపెట్టలో ఇమిడే చీరను 48 ఇంచుల పొడవు, పట్టు దారాలు, జరితో తయారు చేశానని, బరువు 250 గ్రాములు ఉంటుందని చెప్పారు. ఈ చీరల ప్రదర్శనను చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్యర్, ఇతర ప్రముఖులు ఆసక్తిగా తిలకించి, ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా విజయ్‌ని అభినందించారు.