Amrabad Tiger Reserve | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను జూలై నెలాఖరులోగా పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు ప్రణాళిక రూపొందించాలని ప్రభు త్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కాగితపు సంచులు, గుడ్డ-జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజల కు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మైసమ్మ దేవాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్యం డోబ్రియాల్, టీఎస్‌పీసీబీ సభ్య కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.