‘మీ డీకే శివకుమార్‌ను చూస్తుంటే అమితాబ్ గుర్తుకు వస్తున్నాడు’
‘వావ్ డీకేను నువ్వూ గుర్తించినందుకు థాంక్స్. కర్ణాటకలో దుమ్ము దులిపాడు అని తెలంగాణకు పంపారు. అతనిలో బిగ్ బి ని రాహుల్ గుర్తించారు. ఇప్పుడు నువ్వూ…’
‘అవును, ఒక్కరోజు ప్రచారంలోనే అతనిలోని అమితాబ్ కనిపించాడు.’
‘ఏంటీ ప్రచారంలోనే తూగడం చూసి కొంపదీసి షరాబీలో అమితాబ్ కనిపించాడా ఏమిటి?’
‘కాదు షోలేలో అమితాబ్ కనిపించాడు.’
‘బాగా గుర్తు చేశావు. షోలేలో అమితాబ్ ధర్మేంద్ర మంచి స్నేహితులు. ‘తెలంగాణలో పొట్టయ్య, శివకుమార్‌ల స్నేహం చూసి షోలే అమితాబ్ గుర్తుకు వచ్చాడా?’
‘కాదు .. ధర్మేంద్రకు హేమమాలినిని ఇచ్చి పెళ్లి చేయమని పెద్ద మనిషిగా మాట్లాడేందుకు అమితాబ్ వెళ్తాడు గుర్తుందా? ఆ మాటల్లో ధర్మేంద్రకున్న గొప్ప అవలక్షణాలు అన్నీ చెప్పేస్తాడు. అయినా మంచోడు, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని సిన్సియర్ గా చెబుతాడు.’
‘అయితే, అమితాబ్ చెప్పిన దానికీ శివకుమార్కీ సంబంధం ఏమిటి?’
‘మేం కర్ణాటకలో ఐదు గంటల పాటు విద్యుత్ ఇస్తున్నాం అని 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్న తెలంగాణలో ప్రచారం చేయడం అంటే షోలే స్ఫూర్తి అనుకుంటా. అనువాదం నచ్చక మధ్యలోనే ఆపేశాడు కానీ పెన్షన్, రైతు బంధు…ఇలా అన్నింటిలో తెలంగాణ కన్నా కర్ణాటక చాలా వెనుకబడి ఉంది.
‘అలా ఎందుకు చేశాడంటావ్?’
‘కర్ణాటకలో సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ఖర్చు చేసి గెలిస్తే సిద్దరామయ్యను సీఎంను చేసి ఉప ముఖ్యమంత్రి అంటే కోపం రాదా? అసలే ఉప ముఖ్యమంత్రి అంటే ఆరో వేలులాంటిది అని ఉమ్మడి రాష్ట్రంలో అదే కాంగ్రెస్ నాయకులు ఎకసెక్కాలు ఆడారు. తనతో ఖర్చు పెట్టించి తనను ఆరో వేలులా చూస్తే ప్రతీకారం తీర్చుకోవాలనిపించదా?’
‘అవును, ఇంతకూ శివకుమార్ తెలంగాణకు వచ్చింది కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడానికా? వ్యతిరేకంగా ప్రచారం చేయడానికా?’
‘అనుమానం ఎందుకు తెలంగాణలో అడుగుపెట్టక ముందే, ఆయన కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకునే వ్యూహాలు పన్నారు.’
‘ఎలా?’
‘పార్టీని విలీనం చేసేందుకు బెంగళూరు వెళ్లి షర్మిల శివకుమార్‌ను కలిశారు. సోనియాను కలిశారు. కాంగ్రెస్ అంటే ఢిల్లీ పెత్తనం అనే విమర్శను తుడిపేసి, తెలంగాణ కాంగ్రెస్ అంటే కర్ణాటక పెత్తనం అనే ముద్రకు అంతా రెడీ చేశారు.
‘అవును, రాజన్న బిడ్డకు కాంగ్రెస్ చేయి ఇచ్చింది… ఇది తప్పు కదా?’
‘తప్పే, అలా చేసి శివకుమార్ కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. శివకుమార్‌ను చూడగానే తెలంగాణ ప్రజలకు కర్ణాటక రైతుల దుస్థితి గుర్తుకు వస్తుంది. ఎక్కడ మరిచిపోతారో అని శివకుమార్ వెళ్లిన చోటల్లా కర్ణాటకలో మేం ఐదు గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని కూడా చెబుతున్నారు.’
బ్రేకింగ్ న్యూస్… శివకుమార్‌తో తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయించాలి అని డిమాండ్.
‘డిమాండ్ ఎవరి నుంచి కాంగ్రెస్ నుంచేనా?’
‘కాదు బీఆర్ఎస్ నుంచి…’
– మురళి