Kondal Reddy Anumula | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ్ముడు ఎనుముల కొండల్రెడ్డిపై అమెరికా కోర్టు వారెంట్ జారీ చేసినట్టు తెలిసింది. కొండల్‌రెడ్డి దంపతులు ప్రవాస భారతీయుడి నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో, సదరు ఎన్నారై కోర్టును ఆశ్రయించగా, కొండల్రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైనట్టు సమాచారం.
ఇదంతా నిజమేనని బాధితుడు డేవిడ్ ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలు బాధితుడి మాటల్లోనే.. ‘1972లో అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను. నా మేనల్లుడు రఘోత్తంకు ఎరుపుల కన్సల్టింగ్ సంస్థ ద్వారా కొండల్‌రెడ్డి పరిచమయ్యారు. రఘోత్తం, కొండల్‌రెడ్డి కలిసి కొంతకాలం కన్సల్టింగ్ సంస్థను నడిపారు. మనస్పర్థలు, వివాదాల కారణంగా విడిపోయారు.
సొంతంగా బిజినెస్ పెడతామంటూ కొండల్‌రెడ్డి దంపతులు డబ్బుల కోసం నన్ను సంప్రదించారు. వారిపై సానుభూతితో 58,500 అమెరికా డాలర్లు ఇచ్చాను. వారిచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దాంతో ఆధారాలతోసహా న్యూజెర్సీ సుపీరియర్ కోర్టులో కొండల్రెడ్డిపై క్రిమినల్ కేసు ఫైల్ చేశాను. విచారణ జరిపిన కోర్టు కొండల్‌రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
అరెస్టు వారెంట్ కూడా జారీచేసింది. కొండల్‌రెడ్డి అమెరికాను విడిచి వెళ్లడంతో నాటినుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఒకవేళ కొండల్‌రెడ్డి అమెరికాకు వస్తే నేర చరిత్ర ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేస్తారు’ అని పేర్కొన్నారు. కొండల్‌రెడ్డి తన దగ్గర అప్పు తీసుకున్నట్టు ఉన్న చెక్స్, ప్రామిసరి నోటు, కోర్టు తీర్పులు, ఇతర ఆధారాలు ఇవేనంటూ అంటూ వాటిని మీడియా చూపించారు.