హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో అరుదైన భారతీయ అలుగుల (ఇండియన్ పాంగోలిన్) ఉనికిని గుర్తించారు. అంతరించే దశలో ఉన్న ఈ అలుగుల జాతి టైగర్ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు, మార్కాపురం పరిసరాల్లో కనిపించాయి. పులుల జాడ కోసం పెట్టిన కెమెరా ట్రాపుల్లో వాటిని గుర్తించారు. ఇతర జంతువులతో పోలిస్తే వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు అక్కడి గిరిజనులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అలుగుల ఉనికి, ఆవాసాలు, వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తూర్పు కనుమల వైల్డ్‌లైఫ్ సొసైటీ, రాష్ట్ర అటవీశాఖ సంయుక్తంగా పరిశోధనలు ప్రారంభించాయి. అవి ఆహారం తినడానికి, నివాసం కోసం తవ్వే బొరియలు వేర్వేరుగా ఉన్నాయి. అలుగుల అక్రమ రవాణా విషయాన్నీ తాము తెలుసుకుంటున్నామని వైల్డ్‌లైఫ్ సొసైటీ అధ్యక్షుడు కంటి మహంతిమూర్తి తెలిపారు.