హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లోనూ ఎమర్జింగ్ కోర్సులను మిళితం చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఎమర్జింగ్ కోర్సులైన ఏఐ, ఎంఎల్, డాటా సైన్స్ వంటి కోర్సులను కోర్కోర్సుల్లో అంతర్భాగం చేయనుంది. వీటిలో కొన్నింటిని తప్పనిసరి చేయనుండగా, మరికొన్నింటిని ఎలక్టివ్, యాడ్ఆన్ కోర్సులుగా అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే తప్పనిసరి కోర్సులను 160 క్రెడిట్స్‌లో క్లెయిమ్ చేసుకునే అవకాశముండగా, యాడ్ఆన్, ఎలక్టివ్ కోర్సులను క్లెయిమ్ చేసుకునే అవకాశంలేదు. ఇంటర్ డిసిప్లినరీ విధానాన్ని సైతం అనుసరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఉన్నతవిద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ చైర్మన్‌గా, ఓయూ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ డీన్ క్రిష్ణయ్య, జేఎన్టీయూ ఎలక్ట్రికల్ విభాగం ఆచార్యుడు ప్రొఫెసర్ భాస్కర్, సీసీఐ మాజీ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (నాస్కామ్) సీఈవో డాక్టర్ శ్రీరామ్‌తో కూడిన కమిటీని నియమించారు. త్వరలోనే భేటీ అయ్యి సిలబస్‌ను ఖరారుచేయనుంది.