హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా)ను ‘జాతీయ స్థాయి నోడల్ ఏజెన్సీ’గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. హాకా ఇకపై కేంద్రం తరపున వ్యాపారం చేయనున్నది. జాతీయ నోడల్ ఏజెన్సీ హోదాతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్), నాకాఫ్ వంటి సంస్థల సరసన హాకా చేరింది. హాకాకు జాతీ య స్థాయి గుర్తింపు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ గుర్తింపు కోసం హాకా అధికారులు ఆరునెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లిన అధికారులు.. కేంద్ర కోఆపరేటివ్ అధికారులతో సమావేశమై హాకా గురించి వివరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే హాకా ఏర్పాటైందని, దేశంలోనే అతి పురాతన సంస్థ అని తెలిపారు. హాకా బలోపేతానికి దేశవ్యాప్తంగా వ్యాపారం చేసే అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై కొన్ని నెలలపాటు నాన్చిన కేంద్రం.. ఎట్టకేలకు జాతీయ నోడల్ ఏజెన్సీగా గుర్తింపు ఇచ్చింది.
తొలుత శనగల కేటాయింపు
జాతీయ నోడల్ ఏజెన్సీ హోదా దక్కించుకున్న హాకాకు కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా శనగలను కేటాయించింది. శనగపప్పు ధర అధికంగా ఉండటంతో ప్రభుత్వ పరంగా తక్కువ ధరకు వినియోగదారులకు అందించేలా కేంద్రం చేపట్టిన ‘భారత్‌దాల్’ మిషన్‌లో భాగంగా హాకాకు శనగపప్పును సరఫరా బాధ్యతను అప్పగించి 50 వేల టన్నుల శనగలను కేటాయించింది. వీటిని పప్పుగా మార్చి.. మార్కెట్లోకి విడుదల చేయాల్సిన బాధ్యత హాకాపై ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా హాకాకు రూ.150 కోట్ల టర్నోవర్ పెరగనున్నది. ప్రస్తుతం హాకా టర్నోవర్ రూ. 150 కోట్లు కాగా, అది డబుల్ కానున్నది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో హాకా ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా వ్యాపారం విస్తరణ
ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు హాకాను పట్టించుకోలేదు. దశాబ్దాలపాటు ఈ సంస్థకు చైర్మన్‌ను కూడా నియమించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తొలిసారిగా హాకాకు మచ్చ శ్రీనివాస్‌రావును చైర్మన్‌గా నియమించింది. ఆయన హాకాను బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. హాకా తెలంగాణలో రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలుతోపాటు ఇతర ప్రభుత్వ సంస్థలకు ఆహార సరుకులను సరఫరా చేస్తున్నది. దీన్ని మరింత విస్తరించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. ఇతర రాష్ర్టాల్లోనూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేలా, ప్రభుత్వ సంస్థలకు సరుకులు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం జాతీయ నోడల్ ఏజెన్సీ కోసం దరఖాస్తు చేసి.. సాధించారు.