హైదరాబాద్ సిటీబ్యూరో/నాంపల్లి కోర్టులు, మే 16 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో నిందితులు 31, అరెస్టుల సంఖ్య 30కి పెరిగింది. సోమవారం వారిని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చారు. దానంనేని రవితేజ, గున్రెడ్డి క్రాంతికుమార్‌రెడ్డి, కొంతం శశిధర్‌రెడ్డిలకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సుష్మిత దంపతులు ప్రధాన నిందితుడైన ప్రవీణ్ నుంచి రూ.6 లక్షలకు డీఏవో పేపర్‌ను కొని దొరికిపోయారు.
అదే జిల్లాకు చెందిన దానంనేని రవితేజ బెంగళూర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, డీఏవో పరీక్షకు సిద్ధమయ్యాడు. ఇతడికి సుష్మిత స్నేహితురాలు. రూ.15 లక్షలకు సుష్మిత భర్త సాయిలౌకిక్ ప్రశ్నపత్రం విక్రయించాడు. నిందితుల కాల్‌డాటా, బ్యాంకు లావాదేవీలు, పరీక్ష రాసిన వారి వివరాలను పరిశీలిస్తున్న క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏఈఈ పేపర్‌ను కొనుగోలు చేసి అరెస్టయిన మధ్యవర్తి హైదరాబాద్‌కు చెందిన మురళీధర్ బంధువు కొంతం శశిధర్‌రెడ్డి. ఇతనికి ఏఈఈ పేపర్ లీకేజీ విషయం మురళీధర్ చెప్పడంతో తన బంధువైన గున్రెడ్డి క్రాంతికుమార్‌రెడ్డికి ప్రశ్నపత్రం ఇప్పించాడు. విచారణలో రవితేజ, క్రాంతి, శశిధర్‌రెడ్డి వ్యవహారాలు బయటకు రావడంతో మంగళవారం సిట్ ముగ్గురిని అరెస్టు చేసింది.