(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్(నమస్తే తెలంగాణ): కొరియా సినిమాల్లో జాంబీలను చూసే ఉంటారుగా. ఆ జాంబీలు నిజజీవితంలో ఎదురైతే ఎలా? పశ్చిమాసియా దేశం సియెర్రా లియోన్‌లో దాదాపు ఇలాంటి పరిస్థితులే దాపురించాయి. ‘జాంబీ డ్రగ్’కు బానిసైన కొందరు యువకులు, పైసల కోసం మరికొందరు డీలర్లు.. ఇలా అందరూ కలిసి దేశంలోని అన్ని శ్మశానాలపై పడ్డారు. సమాధులను తవ్వి ఎముకలను పట్టుకుపోతున్నారు. పరిస్థితులు అదుపుతప్పడంతో దేశాధ్యక్షుడు జూలియస్ మాడా బయో దేశమంతటా అత్యయిక స్థితిని విధించారు.
ముప్పు ముంచుకొచ్చింది ఇలా..
జాతుల వైరం, అంతర్గత కుమ్ములాటలు, ఆర్థిక-ఆహార సంక్షోభంతో అల్లాడే సియెర్రా లియోన్‌లో నిరుద్యోగమూ ఎక్కువే. యువకులు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఇదే సమయంలో 2018లో ‘కుష్’ అనే జాంబీ డ్రగ్ అక్రమార్కుల ద్వారా దేశంలోకి ప్రవేశించింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం.. దీనిపై నిషేధం విధించింది. అయితే, చాపకింద నీరులా విస్తరించిన ఈ డ్రగ్ మహమ్మారి ఇప్పుడు ఆ యువతనే బలిగొనే స్థాయికి చేరింది.
పిచ్చిపట్టిన వారిలా..
‘కుష్’ తయారీలో మనిషి ఎముకల పొడిని వాడుతారు. కొందరు అత్యాశపరులైన డీలర్లు దొంగలకు డబ్బులిచ్చి సమాధులను తవ్వించి, ఎముకలను తయారీదారులకు అందజేస్తున్నారు. డ్రగ్‌ను స్వతహాగా తయారు చేసుకోవడానికి కొందరు యువకులు జట్టుగా ఏర్పడి గంజాయిని ఇండ్లల్లోనే పెంచుకొని, శ్మశానాలపై పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వందలాది సమాధులను తవ్వినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం శ్మశానవాటికల వద్ద పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసింది. డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని బయో తెలిపారు.
ఏమిటీ జాంబీ డ్రగ్ ‘కుష్’?
గంజాయి, టెంటానైల్, ట్రామడోల్ వంటి మత్తు పదార్థాలు, మనిషి ఎముకల మిశ్రమంతో తయారు చేసేదే ‘కుష్’. దీన్ని కొద్దిగా తీసుకొన్నా.. కొన్ని గంటల వరకూ మత్తులో తూగేలా చేస్తూ మెదడుపై దుష్ప్రభావాన్ని కలుగజేస్తుంది. శరీరంలోని అవయవాలకు వాపు, అంతర్గత రక్తస్రావాలకు కారణమై ప్రాణాలను తీస్తుంది. ‘కుష్’ డ్రగ్ కారణంగా 18-25 ఏండ్ల వయసున్న యువతే ఎక్కువగా ప్రభావితం అవుతుండగా.. మరణాల సంఖ్య వందల్లో ఉన్నట్టు తెలుస్తున్నది.