న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల కంచె గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయడంపై బాలీవుడ్ నటి రిచా చద్దా ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఆమె విమర్శలు గుప్పించారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, వందలాది మందిని అరెస్టు చేసినప్పటికీ రాహుల్‌గాంధీ మౌనంగా ఉండటాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ మేరకు ఓ విద్యార్థులను పోలీసులు వ్యాన్లలోకి ఈడ్చుకెళ్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘హే..! రాహుల్‌గాంధీ.. మీ వద్ద ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది కదా.
ఆ ప్రేమలో కొంచెమైనా ప్రకృతిపై చూపండి’ అని చెబుతూ రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేశారు. ‘అర్ధరాత్రి చిమ్మచీకట్లో చెట్లు ఎందుకు నరుకుతున్నారు. చిమ్మచీకట్లో పని చేసేదెవరు? దొంగలే కదా!’ అని తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి చెట్లను నేలమట్టం చేస్తున్న సమయంలో నెమళ్లు, ఇతర పశుపక్ష్యాదుల అరణ్యరోదనను షేర్ చేశారు.
అంతేకాదు, ప్రముఖ దక్షిణాది నటులు ఈ ఘటనపై స్పందించాలని ఆమె కోరారు. చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, సమంత తదితర నటీనటులు జీవవైవిధ్య పరిరక్షణకు మద్దతుగా నిలవాలని, ఈ పిచ్చి పనిని ఆపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయ డం, వాతావరణ మార్పులపై చూపే ప్రభావం గురించి నటి రిచా చద్దాను ‘ది టెలిగ్రాఫ్’ ప్రశ్నించగా ఆమె స్పందించారు. ‘ఇప్పటికే మనం తీవ్రమైన ఉష్ణోగ్రతలను చవిచూస్తున్నాం. పర్యావరణాన్ని విధ్వంసం చేయడమంటే సామూహిక ఆత్మహత్య లాంటిదే’ అని వ్యాఖ్యానించారు.