కాశీబుగ్గ, ఆగస్టు19: అది ప్రధాన రోడ్డు.. ఎటు చూసినా జనసందోహం నడుమ ఎలాంటి అనుమతి లేకుండా మంత్రి బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఇందులో స్వయంగా ఓ ఏసీపీ, సీఐ, సిబ్బంది సైతం పాల్గొనడంతో ఇక ‘అనుచరులు’ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇష్టంవచ్చినట్టు పటాకులు పేల్చడంతో ఏ సంబంధం లేని నలుగురు బాటసారులు గాయపడ్డారు. గ్రేటర్ వరంగల్‌లోని కాశీబుగ్గ ప్రధాన రోడ్డుపై సోమవారం నిర్వహించిన మంత్రి కొండా సురేఖ బర్త్‌డే వేడుకల్లో ఈ ఘటన జరిగింది.
మంత్రి ముఖ్య అనుచరుడు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టగా కార్యకర్తల అత్యుత్సాహం బాటసారుల ప్రాణాలమీదికి తెచ్చింది. వారు పేల్చిన పటాకులతో దారిన వెళ్లే బాలిక హరిణి, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, ఇంతెజార్గంజ్ సీఐ మచ్చ శివకుమార్, మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య, పోలీసు సిబ్బంది కూడా హాజరై కేక్‌కట్ చేసి చీరెలు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. అసలే రాఖీ పౌర్ణమి కావడంతో రద్దీగా ఉన్న రోడ్డుపై పెద్ద ఎత్తున పటాకులు కాల్చడంతో ఈ ప్రాంతమంతా గందరగోళంగా మారింది.
బాటసారులు, బంధువులే కలిసి బాధితులను ఎంజీఎం వైద్యశాలకు తరలించారు. జంక్షన్ నుంచి కాశీబుగ్గకు వెళ్లే రోడ్డును బ్లాక్ చేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. పండుగ రోజు ఇలా రోడ్డు బ్లాక్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఏమిటని స్థానికుల్లో అసహనం వ్యక్తమైంది. ఈ విషయం తెలిసి బాలికకు మెరుగైన వైద్యం అందిస్తామని, నయమయ్యేదాకా ఖర్చులు భరిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.