హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ అధికారులు అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదిస్తున్నట్టు అవినీతి నిరోధకశాఖ వెల్లడించింది. ఈ మేరకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇండ్లలో శుక్రవారం జరిపిన సోదాల వివరాలను ఏసీబీ ఉన్నతాధికారులు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తనిఖీల సందర్భంగా గుర్తించిన నగదు, నగలు, ఆస్తుల పత్రాల విలువ వందల కోట్లు ఉం టుందని చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయా ల్లో జరుగుతున్న అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ పత్రిక శుక్రవారం ‘పెన్సిల్ రాత.. కోట్లలో మేత’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ ఉన్నాధికారుల సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గండిపేట, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మంలోని వైరాలో తనిఖీలు చేపట్టారు.
సిబ్బంది, ప్రైవేటు వ్యక్తుల వద్ద లెక్క చూపని రూ.2,51,990 నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. మొత్తం 289 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సీజ్ చేశారు. కార్యాలయాల్లో 19 మంది ప్రైవేట్ వ్యక్తులు ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు గమనించామని ఏసీబీ అధికారులు చెప్పారు. 60 మంది డాక్యుమెంట్ రైటర్లు ఎస్ఆర్వోలతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు. వీటితోపాటు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలు చాలాచోట్ల పనిచేయడం లేదని చెప్పారు. తనిఖీల్లో గమనించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
‘నమస్తే తెలంగాణ’ కథనం ఆధారంగా నిర్వహించిన సోదాల్లో సబ్రిజిస్ట్రార్లు అక్రమ పద్ధతుల్లో భారీగా ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ అధికారులు తేల్చారు. పలువురు అవినీతి అధికారుల కార్యాలయాలతోపాటు.. వారి ఇండ్లలోనూ సోదాలు చేపట్టారు. 13 మంది సబ్ రిజిస్ట్రార్ల ఇండ్లలో నిర్వహించిన తనిఖీలలో భారీగా నగదు, నగలు, పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ ఉన్నతాధికారులు విశ్వసనీయంగా తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అక్రమాలకు పాల్పడితే తక్షణం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని లేదా 9440446106 నంబర్‌కు వాట్సాప్ చేయాలని, ఫిర్యాదు చేసిన వారి పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.