గుండాల, సెప్టెంబర్ 3 : భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో పోడు భూమిలో ట్రెంచ్ కొట్టకుండా ఉండేందుకు ఓ రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌తోపాటు అతడికి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లపల్లి మండలం వలసల్ల బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బానోత్ రవికుమార్.. గుండాల మండలం కాచనపల్లి రేంజ్‌లోని రామానుజగూడెం బీట్‌లో అదనపు బాధ్యతలు నిర్వర్తిసున్నాడు. రామానుజగూడెంకు చెందిన ఓ రైతు సుమారు రెండున్నర ఎకరాలకుపైగా పోడు భూమి సాగు చేస్తుండగా.. ఇందులో రెండెకరాలకు పట్టా ఉన్నది.
మరో ఎకరానికి పట్టా లేకపోవడంతో ఆ భూమిలో పోడు సాగు చేస్తున్నాడు. ప్లాంటేషన్ ఏర్పాటులో భాగంగా అటవీ అధికారులు రేంజ్ పరిధిలో ట్రెంచ్ తీస్తున్నారు. సదరు భూమిలో ట్రెంచ్ తీస్తున్నామని బీట్ ఆఫీసర్ రైతును బెదిరించడంతోపాటు లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు సదరు రైతు డబ్బులు ఇవ్వడానికి గురువారం గుండాలకు రాగా.. మధ్యవర్తి పటాన్ సాధిక్ ఖాన్‌కు ఇవ్వాలని బీట్ ఆఫీసర్ సూచించాడు. రైతు మధ్యవర్తి సాదిక్ ఖాన్‌కు రూ.30 వేలు అందజేయగా ఆ మొత్తాన్ని బీట్ ఆఫీసర్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.