ACB : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన డీఎస్పీ భీమ్‌రెడ్డి(DSP Bhim Reddy)ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. రూ.300 కోట్ల అక్రమాస్తులు కేసులో సోమవారం ఏసీబీ బృందం భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ‘డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్టు ఎప్పుడో.. అరెస్టు కాకుండా అడ్డుకున్న ‘అదృశ్య శక్తి’ ఎవరు?’ అని నమస్తే తెలంగాణలో కథనం ప్రచురించిన రెండు రోజులకే స్పందించిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు ఆయనను అరెస్ట్ చేశారు.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో డీఎస్పీ భీమ్రెడ్డిపే కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర అనుబంధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. సోదాల్లో లభించిన ఆధారాలు, పత్రాల పరిశీలన అనంతరం భీమ్‌రెడ్డిని అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఏసీబీ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
రాష్ట్ర పోలీస్‌శాఖలో భారీ అవినీతి తిమింగలంగా భావిస్తున్న డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి తిమింగలంగా భావిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో రూ.200 కోట్ల నుంచి 300 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి.