హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): ‘మద్యం పాలసీ కుంభకోణం’ అనేది బోగస్ అని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మరోమారు స్పష్టంచేశారు. మొదటి నుంచి తాము ఈ మా టనే చెబుతున్నామని, ఇప్పుడు కోర్టు కూడా అదే మాట చెప్పిందని పేర్కొన్నారు. మోదీ అల్లిన ఓ కట్టు కథగా అభివర్ణించారు. మద్యం పాలసీ కేసులో కోర్టు తాజా తీర్పును ప్రస్తావించిన కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలోనూ, సోషల్‌మీడియాలోనూ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆప్‌కు సౌత్‌గ్రూప్ 100 కోట్లు ఇచ్చారంటూ బీజేపీ నేతలు ఆరోపించారని, అంతటితో ఆగకుండా రాజేశ్జోషి సౌత్‌గ్రూప్ నుంచి 30 కోట్లను ఢిల్లీలోని ఆప్ పార్టీకి చేరవేసినట్టు ప్రచారం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, రాజేశ్ పైసాకూడా తీసుకొచ్చినట్టు ఆధారాలేవీ లేవని కోర్టు స్పష్టంచేసిందని కేజ్రీవాల్ చెప్పారు. ఇదే కారణంతో రాజేశ్ జోషికి న్యాయస్థానం బెయిల్ కూడా ఇచ్చిందని తెలిపారు.
ఇక ఈ కేసులో ఇంకేం మిగిలిందని ప్రశ్నించారు. సౌత్‌గ్రూప్ నుంచి వచ్చిన 100 కోట్లను ఆప్ గోవా ఎన్నికల్లో చేసినట్టు బీజేపీ చేసిన అరోపణలన్నీ అబద్ధాలేనని ఇప్పుడు తేలిపోయిందని వివరించారు. ప్రధాని మోదీ ఈ కుంభకోణం కథ అల్లుతున్నారని, ఈ కల్పిత కథకు ఆధారాలు సృష్టించాలని దర్యాప్తు సంస్థల అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గోవా ఎన్నికల్లో ఆప్ 19 నుంచి 20 లక్షలు మాత్రమే ఖర్చు చేసిందని దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయని పేర్కొన్నారు. 14 ఫోన్లను మనీశ్ సిసోడియా ధ్వంసం చేశారని కో ర్టుకు తెలిపారని.. తనిఖీలు చేసినప్పుడు 14 ఫోన్లు ఉన్నాయని, అందులో ఐదు ఫోన్లు ప్రస్తుతం వారివద్దే ఉన్నాయని అర్వింద్ కేజ్రీవాల్ వివరించారు. న్యాయస్థానంలో ఈడీ అబద్ధాలు చెబుతున్నదని కేజ్రీవాల్ ఆరోపించారు. చార్జ్‌షీట్‌లో తప్పుగా సంజయ్‌సింగ్ పేరును ప్రస్తావించినట్టు ఈడీ ఒప్పుకోవడాన్ని ఈ మేరకు ఉదహరించారు.