హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : కిమ్స్ ఉషాలక్ష్మీ బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్‌లోని రాయల్ కాలేజీ ఆయనకు ఎఫ్ఆర్సీఎస్ (ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజీ సర్జన్స్) ప్రదానం చేసింది. దక్షిణాసియాలో ఈ ఘనత సాధించిన తొలి పిన్న వయస్కుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
అవార్డు ప్రదానం చేసిన అనంతరం గ్లాస్గో రాయల్ కాలేజీ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా రొమ్ము క్యాన్సర్‌పై పోరాటంలో రఘురామ్ విశేష కృషి చేశారని కొనియాడారు. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసించారు. రఘురామ్ మాట్లాడుతూ.. అత్యున్నత గౌరవాన్ని అందించినందుకు గ్లాస్గో రాయల్ కాలేజీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.