సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 01:32:28

సీఎంగారూ.. మీరు గ్రేట్‌!

సీఎంగారూ.. మీరు గ్రేట్‌!

 • కేసీఆర్‌పై నేవీ డిప్యూటీ చీఫ్‌ ప్రశంసల వర్షం
 • లేఖ రాసిన వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌
 • అమర జవాన్లకు సహాయంపై ధన్యవాదాలు
 • మీరు అపూర్వం, అద్భుతం, అనితర సాధ్యం
 • నాయకత్వ విలువలకు,  మానవీయతకు గుండె తడికి మీరు నిజమైన నిదర్శనం
 • సైన్యంపై మీకు సంపూర్ణ అవగాహన ఉంది
 • మీ భరోసా జవాన్ల  బలాన్ని రెట్టింపు చేసింది
 • ఎలాంటి సాహసాన్నైనా చేసే ైస్థెర్యమిచ్చింది
 • మాజీ ఎంపీ కవిత సహకారం మరువలేం
 • జాతి మా వెంట ఉందనే ధైర్యమిచ్చింది: పవార్‌
 • కోరుకొండ సైనిక స్కూల్‌ను సందర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం


ప్రాణానికి ఎంతని పరిహారమివ్వగలం!

త్యాగానికి ఏమని వెలకట్టి చూపగలం!

ప్రాణత్యాగాన్ని ఏ కొలబద్దతో కొలవగలం! 

దేశ సరిహద్దును కాపలా కాయడం ఉద్యోగం కాదు; అదొక నిబద్ధత!  శత్రు సైనికులను ప్రాణాలకు తెగించి నిలువరించడం  కేవలం విధి కాదు; దేశం మీది ప్రేమకు నిదర్శనం! సరిహద్దంటే భూమి మీద గీసిన   అధీన రేఖల వద్ద గస్తీ కాదు; అది దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం. మరి ఈ కర్తవ్య నిర్వహణలో అమరులైన జవాన్లకు మనం ఏమివ్వగలం? చెయ్యెత్తి శాల్యూట్‌ చేయడం, జాతి మొత్తం వారి కుటుంబానికి అండగా ఉందని చెప్పడం తప్ప! అమర జవాను కుటుంబాన్ని ఆదరంగా, ఆప్యాయంగా చూసుకోవడమే మనం సాహసిక సైనికులకు ఇచ్చే నిజమైన భరోసా.  చైనా సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన మన సైనికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదే పని చేశారు. తెలంగాణ యోధుడు కర్నల్‌ సంతోష్‌ కుటుంబంతో సహా అమరులైన 19 మంది భారత జవాన్ల కుటుంబాలకు అపూర్వ రీతిలో అండగా నిలిచారు. ఇందుకు ముఖ్యమంత్రిపై భారత సైన్యం ప్రశంసలు కురిపిస్తున్నది. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు అపూర్వమని, అత్యున్నతమని, మార్గదర్శకమని సైనికాధికారులు ప్రశంసిస్తున్నారు.


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అమర జవాన్లకు సాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఔదార్యాన్ని భారత నౌకాదళ డిప్యూటీ చీఫ్‌.. వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ‘కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి(సాయికొరియన్‌)’ హోదాలో ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్న పవార్‌ ముఖ్యమంత్రికి ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు. చైనా సరిహద్దులో అమరుడైన సూర్యాపేట వీరయోధుడు కర్నల్‌ సంతోష్‌బాబు కూడా కోరుకొండ సైనికస్కూల్‌ విద్యార్థే! ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోరుకొండలో ఉన్న ఈ స్కూల్లోనే వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ కూడా చదువుకున్నారు. ఆ స్కూల్లో చదువుకుని ప్రస్తుతం సైన్యంలో ఉన్న అత్యంత సీనియర్‌ అధికారి వైస్‌ అడ్మిరల్‌ పవారే! ‘కర్నల్‌ సంతోష్‌బాబు అమరుడైన వెంటనే ఆయన కుటుంబానికి మీరు అండగా నిలిచిన తీరు, ఉదారంగా సహాయం ప్రకటించడం, దాన్ని వెంటనే అమలుచేయడం అపూర్వం. అనితర సాధ్యం’ అని వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు. 24వ తేదీన ఆయన రాసిన ఈ లేఖ శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి అందింది. “మాతృభూమి రక్షణలో భారత సైనికుడు ప్రాణత్యాగానికి సైతం ఎన్నడూ వెరవడన్న వాస్తవాన్ని చరిత్ర అనేకమార్లు రుజువుచేసింది.


జాతీయ యుద్ధస్మారకంపై మెరిసే అమరుల పేర్లు, ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌ కారిడార్లలో వెలిసిన శౌర్యపతాక విజేతల చిత్రపటాలే ఇందుకు నిదర్శనం. సౌత్‌బ్లాక్‌లోని నా కార్యాలయానికి వెళ్తూ ప్రతిరోజూ నేను ఈ చిత్రపటాలను గర్వంగా, ఆదరంగా చూస్తుంటాను. ఇటువంటి సాహసిక సైనికుల రుణాన్ని జాతి ఎలా తీర్చుకోవాలన్న దానికి మీరు ఈ రోజు ఒక ఉదాహరణలా నిలిచారు. మీరిచ్చిన భరోసా ఈరోజు యుద్ధసరిహద్దుల్లో నిలిచిన మన జవాన్ల ఆత్మబలాన్ని రెట్టింపుచేసింది. వారిలో మానసిక ధైర్యాన్ని దట్టించింది” అని నేవీ డిప్యూటీ చీఫ్‌ పేర్కొన్నారు. “ఏదైనా కానీ, ఏమైనా జరగనీ దేశం కోసం ముందువరుసలో నిలవాల్సిందే. ప్రాణమున్నాపోయినా సరే ముందుకుపోవాల్సిందే. నాకేమైనా అయితే నా కుటుంబాన్ని చూసుకునేందుకు నా జాతిఉంది అనే ఆత్మ విశ్వాసాన్ని మీరు సైనికుల్లో కలిగించారు. ఇందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు” అంటూ కేసీఆర్‌పై నౌకాదళాధికారి ప్రశంసల వర్షం కురిపించారు. 

మీ మానవత్వానికి నిదర్శనం 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వ లక్షణాలను, ఒక నాయకుడిగా ఆయనలో ఉన్న ఆర్ద్రతను కూడా వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో ప్రస్తావించారు. “సైనికుడు అమరుడైన ప్రతిసారీ ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి, ఒక ముఖ్యమంత్రి వందల కిలోమీటర్లు ప్రయాణించి, ఊరుదాకా వెళ్లకపోవచ్చు. వెళ్లడం సాధ్యం కూడా కాకపోవచ్చు. కానీ మీరొక ముందడుగు వేసారు. కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి సాయం ప్రకటించిన కొద్దిరోజుల్లోనే మీరు స్వయంగా సూర్యాపేటదాకా వెళ్లి, ఆయన భార్యకు మీ చేతులతో అందజేయడం మాత్రం అపూర్వం. ఇది మీ నాయకత్వ లక్షణాలకు, ఔదార్యానికి, ఆర్ద్రతకు, మానవత్వానికి నిదర్శనం. కర్నల్‌ సంతోష్‌బాబుతో పాటు అమరులైన 19 మంది సైనికులకు, వారు తెలంగాణకు చెందిన వారు కానప్పటికీ, మీరు ఉదారంగా సాయం చేయడం మాటల్లో చెప్పలేని అనుభూతి. ఆర్మీ పట్ల, సైనికుల పట్ల మీకున్న అవగాహనకు ఇంతకు మించి వేరే చెప్పనక్కర్లేదు” అని కేసీఆర్‌ను నేవీ డిప్యూటీ చీఫ్‌ ప్రశంసించారు.

మాజీ ఎంపీ కవిత కీలకపాత్ర

 సైనికులకు ఉదాత్తమైన సాయం అందడంలో కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కవిత కీలక పాత్ర పోషించి, విశేషమైన కృషి చేశారని ఆయన కొనియాడారు. తాను, కర్నల్‌ సంతోష్‌బాబు చదువుకున్న కోరుకొండ సైనిక్‌స్కూల్‌ను ఒకసారి సందర్శించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రిని పవార్‌ ఆహ్వానించారు. “కోరుకొండ స్కూల్లో తెలంగాణ పిల్లలు కూడా అనేకమంది చదువుకుంటున్నారు. సైన్యానికి అద్భుతమైన అధికారులను ఇచ్చే సంస్థల్లో అది ఒకటి. సైనికాధికారులనే కాదు, చక్కటి వ్యక్తిత్వం, నైపుణ్యం ఉన్న పౌరులను అది తయారుచేస్తుంది. ఇలా తయారైన పౌరులనేకమంది అనేకరంగాల్లో దేశవిదేశాల్లో రాణిస్తున్నారు. అందువల్ల మీరొక్కసారి ఆ స్కూలును తప్పక సందర్శించాలి”అంటూ వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం పలికారు.


logo