హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ బ్లడ్‌బ్యాంక్ అవకతవకల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదుగురు ప్రొఫెసర్ల బృందం బ్లడ్‌బ్యాంక్ స్టాఫ్‌ను మంగళవారం విచారించినట్టు తెలిసింది. బ్లడ్‌బ్యాంక్ నుంచి అర్ధరాత్రి బ్యాగ్‌లు బయటకు వెళ్తుంటే ఏం చేశారని కమిటీ సిబ్బందిని నిలదీసింది. ఈ వ్యవహారాన్ని తాను చూసుకుంటానని సూపరింటెండెంట్ సమాచారం ఇచ్చారని సిబ్బంది విచారణ కమిటీకి తెలిపింది. తాము చెప్పిన తర్వాత మెడికల్ సూపరింటెండెంట్ వీడియో ఫుటేజీ చెక్ చేశారని, అందులో బ్యాగ్‌లు తీసుకెళ్తున్నట్టు స్పష్టంగా కనిపించినట్టు సిబ్బంది విచారణ కమిటీకి తెలిపింది. బ్లడ్‌బ్యాంక్ స్టాఫ్ చెప్పిన వివరాలను ప్రొఫెసర్ల కమిటీ స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేసినట్టు తెలిసింది.
కేసులు ఉన్న వ్యక్తిని బ్లడ్‌బ్యాంక్‌లో ఎలా పనిచేయనిస్తారని ప్రొఫెసర్ల బృందం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. పలు కోణాల్లో విచారించిన కమిటీ త్వరలో నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి ఇవ్వనున్నది. మరోవైపు నిలోఫర్ దవాఖాన అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్యంపై సర్కారు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నది. వరుసగా వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. బ్లడ్‌బ్యాంక్ అక్రమాలు, సూపరింటెండెంట్‌పై వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కమిటీ మరిన్ని వివరాలు సేకరించనున్నది. దీంతోపాటు ఫోర్త్‌క్లాస్ ఉద్యోగుల ప్రవర్తన, స్టాఫ్ పనితీరుపై కూడా కమిటీ ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నట్టు సమాచారం.