ఖిలావరంగల్, అక్టోబర్ 20: వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు ఎన్నికల ఖర్చు కోసం ఓ బాలుడు రూ.10 వేల నగదు అందజేశాడు. వరంగల్‌లోని శంభునిపేటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ వహీద్ కుమారుడు ఎండీ అల్తాఫ్హుస్సేన్ నాలుగేండ్లుగా కుటుంబ సభ్యులు ఇచ్చిన డబ్బులను కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్నాడు.
గురువారం రాత్రి శంభునిపేటలోని ఓ మసీదులో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత పెద్దలు నరేందర్ గెలుపు కోసం మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో అల్తాఫ్ హుస్సేన్ తన తండ్రితో మసీదుకు వచ్చిన తాను దాచుకున్న రూ.10 వేలు ఎన్నికల ఖర్చు కోసం నరేందర్‌కు విరాళంగా అందజేసి అందరిని ఆకట్టుకున్నాడు.