హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో లోకల్, నాన్ లోకల్ కోటాపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. 95శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. ఇక మరో 5శాతం సీట్లను ఇతర రాష్ర్టాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల ఉద్యోగుల పిల్లలకు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇదే జరిగితే నాన్ లోకల్ కోటా ఇకపై ఉండదు. ఇది వరకు ప్రొఫెషనల్ కోర్సుల్లో లోకల్, నాన్‌లోకల్ కోటా 85:15శాతంగా ఉంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే తెలంగాణ విద్యార్థులకు 10శాతం అదనంగా దక్కుతాయి. ఇక మరో 10 శాతం సీట్లను నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాలో భర్తీచేస్తారు. ఈ సీట్లు సూపర్‌న్యూమరీ సీట్లు. వీటిని ఇప్పుడున్న సీట్ల సంఖ్యకు అదనంగా పెంచుతారు. అంటే 2025 -26 విద్యా సంవత్సరంలో అన్ని కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు 10శాతం పెరుగుతాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోగా, త్వరలోనే జీవో జారీకానున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేయకముందే అడ్మిషన్లు తీసుకుంటే ఆయా కాలేజీలకు 2025 -26 గుర్తింపునివ్వబోమని ఇంటర్‌బోర్డు హెచ్చరించింది. పీఆర్వోలను నియమించుకుని, ముందస్తు అడ్మిషన్లు చేపట్టరాదని ప్రకటించింది.