హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కవ్వాల్ పులుల అభయారణ్యం నుంచి మైసంపేట్, రాంపూర్ గ్రామాలకు చెందిన 94 కుటుంబాలకు పునరావాసాల తరలింపు ప్రక్రియ పూర్తయిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. అటవీ జంతువుల సంరక్షణ, వాటి పునరుత్పాదకత కోసం గ్రామాలను ఖాళీ చేసి పునరావాసాన్ని కల్పించడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారని తెలిపారు. గు రువారం గ్రామస్థులందరూ ఒకేసారి గృహప్రవేశాలు చేశారు.
ఈ రెండు గ్రామాలకు చెంది న 142 కుటుంబాలను అధికారులు పునరావాసం కోసం ఎంపిక చేయగా, వీరిలో 48 కుటుంబాలు ఏకమొత్తంగా రూ.15 లక్షల పరిహారానికి అంగీకరించారు. మిగిలిన 94 కుంటుంబాలకు అవే రూ.15లక్షల పరిహారంలో భాగంగా ఒక ఇల్లు, వ్యవసాయ భూ మిని అందించేందుకు అటవీశాఖ ఒప్పించింది. కవ్వాల్కు సమీపంలోనే కొత్త మద్దిపడగలో మొత్తం12.36ఎకరాల్లో అన్ని వసతులతో పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో కవ్వాల్ అభయారణ్యంలోని మిగతా గ్రామాలు, అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని 4 పునరావాస గ్రామాల ప్రక్రియ కూడా పూర్తవుతుందని తెలిపారు.