హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: రాష్ట్రంతోపాటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతూనే ఉన్నది. రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన కృష్ణమ్మ.. శనివారం సాయంత్రానికి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు 80 వేల క్యూసెక్కులు రాగా, ప్రస్తుతం 61 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. జూరాల ప్రాజెక్టుకు 2.40 లక్షల క్యూసెక్కులు రాగా, అది 1.70 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. తుంగభద్రలోనూ వరద 74 వేల నుంచి 34 వేలకు తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద యథావిధిగా కొనసాగుతున్నది. నాగార్జునసాగర్‌కు ఎగువన శ్రీశైలం నుంచి శనివారం 4,37,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. మూడోరోజు కూడా ప్రాజెక్టు 22 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 3,48,472 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్‌కు శనివారం 9,291.17 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు నాలుగు గేట్లతోపాటు కుడి, ఎడమ కాల్వల ద్వారా 4,286.66 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన ఎస్సారెస్పీకి శుక్రవారం సాయంత్రం 33 వేల క్యూసెక్కులు వరద రాగా, శనివారం రాత్రికి 1,08,540 క్యూసెక్కులకు పెరిగింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు 34,200 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఎనిమిది గేట్ల ద్వారా 80,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి, పార్వతి, సర్వస్వతి బరాజ్‌ల వద్ద వరద క్రమంగా పెరుగుతున్నది. లక్ష్మీ బరాజ్ వద్ద వరద గోదావరి ఉరకలెత్తున్నది. ఏకంగా 4.50 లక్షల వరద వచ్చి చేరుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పెద్దమిడిసిలేరు సమీపంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి విడుదల చేశారు.