DGP Jithender | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నవారిలో విద్యావంతులు, ఉద్యోగస్తులే 70% మేరకు ఉంటున్నారని డీజీపీ జితేందర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం జరిగిన ‘గ్రేట్ యాప్ సెక్ హ్యాక్‌థాన్-2024’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలను అరికట్టడంతోపాటు బాధితుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చురుకుగా వ్యవహరిస్తున్నదని కొనియాడారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.1,050 కోట్ల నగదు సైబర్ నేరగాళ్లకు చేరకుండా ఫ్రీజ్ చేయడంతోపాటు పలు కేసుల్లో రూ.90 కోట్ల వరకు రికవరీ చేసిందని, దాదాపు రూ.85 కోట్ల సొమ్మును బాధితులకు అప్పగించిందని ప్రశంసించారు. సైబర్ నేరాలను అడ్డుకునేందుకు యువత, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ముందుకు రావాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు.
సైబర్ నేరాలపై యువత తమ కుటుంబసభ్యులు, బంధువులతోపాటు సమాజాన్ని జాగృతం చేయాలని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ కోరారు. ‘గ్రేట్ యాప్ సెక్ హ్యాక్‌థాన్-2024’లో 20 దేశాల నుంచి 10 వేల మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారని శిఖాగోయెల్ తెలిపారు. రాష్ట్రం నుంచి టాప్-5లో నిలిచిన హ్యాకర్స్తోపాటు జాతీయ, అంతర్జాతీయ టాప్-5లో నిలిచిన హ్యాకర్స్‌కు సీఎస్బీతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ విభాగం ఐఏఎస్ అధికారి భవేశ్ మిశ్రా, కేంద్ర ప్రభుత్వ అధికారి నరేంద్రనాథ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, డీఎస్ఈఐ శ్రీరామ్, సీఎస్బీ ఎస్పీ దేవెందర్సింగ్, ఏసీపీ కేవీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా నుంచి సైబర్ నిపుణుడు మిషెల్ రెడ్మెక్, అమీర్ జావేద్ ‘జూమ్’ ద్వారా సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం వేర్వేరు సైబర్ నేరాల కేసుల్లో ఫ్రీజ్ చేసిన సొమ్మును బాధితులకు తిరిగి ఇచ్చేశారు.