ఎల్లారెడ్డిపేట, మే 12: ‘సర్కారు దవాఖానలో కాన్పు.. నా కుటుంబానికి 60 వేల రూపాయల ఆర్థిక భారాన్ని తగ్గించింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్’ను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన మానుక మహేశ్.. భార్య సంగీతను రెండో కాన్పు కోసం గురువారం సిరిసిల్ల జిల్లా దవాఖానలో చేర్పించాడు. శుక్రవారం వైద్యులు సంగీతకు ఆపరేషన్ చేయగా పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని మహేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రైవేట్ దవాఖానలో అయితే 60 వేల రూపాయలు ఖర్చు అయ్యేదని, కానీ సర్కారు దవాఖానలో పూర్తి ఉచితంగా ఆపరేషన్ చేశారని చెప్పాడు. అంతేకాదు.. 13 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో పడనున్నాయని, కేసీఆర్ కిట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని పేర్కొన్నాడు. తన లాంటి పేదోళ్ల కోసం సిరిసిల్ల జిల్లా దవాఖానలో సకల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు మహేశ్ కృతజ్ఞతలు తెలిపాడు.