‘పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశాం. తద్వారా ప్రజలకు అన్ని రకాల పాలనాపరమైన అంశాలు అందుబాటులోకి రావడంతోపాటు జిల్లా, డివిజన్ అధికారులు సైతం గ్రామీణ ప్రజలకు మరింత చేరువవుతారు. దీంతో ప్రజల్లో ప్రశ్నించే సామర్థ్యం పెరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం దగ్గర ప్రజల వివరాలన్నీ ఉంటాయి. ప్రజల కోసం ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి చిట్టచివరి లబ్ధిదారుడికి అందాలన్నదే మా లక్ష్యం’
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్త శకం ప్రారంభమై ఐదేండ్లు పూర్తయింది. నాడు 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ.. సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రక నిర్ణయంతో నేడు 33 జిల్లాలకు విస్తరించింది. స్వతంత్ర భారతావని చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేపట్టని పాలనా సంస్కరణలకు 2016 అక్టోబర్ 11వ తేదీ సాక్షిగా నిలిచింది. అందుకు సీఎం కేసీఆర్ పుట్టిన గడ్డ.. రాజకీయంగా ఎదిగిన నేల సిద్దిపేట వేదికగా మారింది. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి కలిగిన ముఖ్యమైన ప్రయోజనాలను ఓసారి విశ్లేషిస్తే..
చేరువైన పాలన
ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చివరి గ్రామాల ప్రజలకు నరకం కనిపించేంది. కనీసం ఐదారు గంటల ప్రయాణించాల్సి వచ్చేది. నేరుగా బస్సు సౌకర్యం లేనివారు కనీసం రెండుమూడు బస్సులు మారాల్సి వచ్చేది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా వాజేడు మండల ప్రజలు ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దాదాపు 250 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. కనీసం ఏడెనిమిది గంటల ప్రయాణంతో రెండు రోజులు తిప్పలు పడేవారు. ఇప్పుడు ములుగు జిల్లా ఆవిర్భావంతో ప్రయాణ ఖర్చుతోపాటు ప్రయాణ దూరం 80 కిలోమీటర్లకు తగ్గింది.
ఒకప్పుడు మారుమూల ప్రాంతాలకు వెళ్లడం జిల్లా స్థాయి అధికారులకు సైతం చాలా ఇబ్బందిగా ఉండేది. కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు శివారు ప్రాంతాలకు వెళ్లడమే గగనం. దీంతో కొన్ని ప్రాంతాలపై వారికి పెద్దగా పట్టు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అత్యధిక జిల్లాల పరిధి జిల్లా కేంద్రం నుంచి దాదాపు 50-70 కిలోమీటర్లే. దీంతో అన్ని ప్రాంతాలపై పర్యవేక్షణ పెరిగి ప్రజలకు పాలన చేరువైంది. పాత దవాఖానలు జిల్లా కేంద్ర హాస్పిటళ్లుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో ప్రజలకు వందల పడకలతో వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
అర్హులందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు
గతంలో పెన్షన్లు, రాయితీలు ఇతర ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేవి కాదు. తిప్పలు పడి జిల్లా కేంద్రానికి వెళ్లినా.. ఆ సమయానికి జిల్లా అధికారులు అందుబాటులో లేక అవస్థలు పడేవారు. దీంతో కనీసం రెండుమూడు సార్లయినా జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. అంత ఓపిక లేక చాలా మంది తమ ప్రయత్నాలను మానుకునేవారు. ఇప్పుడు జిల్లా కార్యాలయాలు, అధికారులు సమీపంలోనే ఉండటం, పర్యవేక్షణ పెరుగడంతో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయి.
సమీకృత కలెక్టరేట్లు
ఒకప్పుడు జిల్లా కేంద్రంలో ఒక్కో విభాగం ఒక్కో భవనంలో ఉండేది. కొన్ని శాఖలైతే విసిరేసినట్టుగా ఊరికి చివర్లో కనిపించేవి. నానా కష్టాలు పడి జిల్లా కేంద్రానికి వెళ్లినా.. సంబంధిత శాఖ కార్యాలయాన్ని దొరుకబట్టడం గగనమయ్యేది. అడ్మినిస్ట్రేషన్‌కు, పోలీస్ శాఖ భవనాలకు మధ్య దూరం కారణంగా సమన్వయం ఉండేది కాదు. ఇప్పుడు సమీకృత కలెక్టరేట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే కొన్ని ప్రారంభం కాగా.. మరికొన్ని తుది దశలో ఉన్నాయి. వీటితో అన్ని శాఖల అధికారులు ఒకే చోట అందుబాటులో ఉంటున్నారు.
రియల్ బూమ్
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు రియల్ ఎస్టేట్ రంగానికి బాగా కలిసొచ్చింది. ఇవన్నీ పెట్టుబడి ఆకర్షక కేంద్రాలుగా తయారయ్యాయి. భూములకు మంచి ధర లభిస్తున్నది. జిల్లా, మండల కేంద్రాల్లో భూముల ధరలు దాదాపు రెట్టింపై అనేక వెంచర్లు వెలిశాయి.
నెరవేరిన ప్రజాభీష్టం
ఉమ్మడి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు వెల్లువెత్తేవి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ తదితర జిల్లాల్లో ఉద్యమాలు జరిగాయి. జిల్లా సాధన సమితి పేరుతో ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించిన రోజులున్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన పాలనా సంస్కరణలతో ప్రజల దశాబ్దాల కల 2016 అక్టోబర్ 11న నెరవేరింది.