Congress | చందుర్తి, అక్టోబర్ 21: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో కాంగ్రెస్ నాయకుల వాహనాల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మూడపల్లి వద్ద సీఐ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో రుద్రంగి నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీటీసీ భర్త వేల్పుల దేవస్వామి కారును తనిఖీ చేయగా రూ.4.40 లక్షలు పట్టుబడ్డాయి. వాహనంలో నోట్ల కట్టలు వెలుగుచూడటంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.
అలాగే.. ఆశిరెడ్డిపల్లికి చెందిన మాదిరెడ్డి రవీందర్రెడ్డి వేములవాడ నుంచి ఆశిరెడ్డిపల్లికి వెళ్తుండగా రూ.1.50 లక్షలు పట్టుకున్నారు. పట్టుకున్న నగదును ఫ్లయింగ్ స్కాడ్కు అప్పగించినట్టు ఎస్సై అశోక్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో పలు చోట్ల రూ.36 లక్షలు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.