కొండాపూర్, జూన్ 5: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని అత్యధిక వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికైనట్టు వర్సిటీ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వర్సిటీలో ఎంటెక్ (స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ విభాగం) విద్యార్థిని చిన్మయి మహాపాత్రో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఈ ఉద్యోగానికి ఎంపికైనట్టు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ‘సర్వీస్ నౌ’ సాఫ్ట్వేర్ సంస్థ రూ.47 లక్షల వార్షిక వేతనంతో చిన్మయిని ఎంపిక చేసిందని తెలిపారు. అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగానికి ఎంపికైన చిన్మయిని వీసీ ప్రొఫెసర్ బీజే రావు ప్రత్యేకంగా అభినందించారు. తన ఎంపికకు దోహదపడిన అధ్యాపకులకు చిన్మయి కృతజ్ఞతలు తెలిపారు.