హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): కోనోకార్పస్ మొక్క నుంచి వచ్చే పుప్పొడి వల్ల 42శాతం మందికి వివిధ రకాల ఎలర్జీలు వస్తున్నాయని ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు. మొట్టమొదటిసారి 1000 మంది ఎలర్జీ పేషెంట్లు, వివిధ రకాల ఎలర్జీలు, దేని వల్ల వస్తుంది, ఎలా నియంత్రించవచ్చు వంటి అంశాలతో ఒక పట్టికను ఆయన విడుదల చేశారు. అత్యధిక మందికి ఎలర్జీ కో నోకార్పస్ మొక్కతోపాటు బొద్దింకలు, హౌస్డస్ట్ మైట్, వయ్యారి భామ చెట్టు పుప్పొడి వల్ల వస్తుందని నివేదికలో వెల్లడించారు. దేశంలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే అశ్విని ఎలర్జీ సెంటర్ కేంద్రంగా 10 వేల కం టే ఎక్కువ మందికి ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ అందించారని తెలిపారు. ఈ అత్యాధునిక చికిత్స విధానం అమెరికా, యూరప్, లండన్ లాంటి ప్రాంతాల్లో ఉండేదని, 10 పదేండ్లుగా దేశంలో అందిస్తున్నారని చెప్పారు. ఎలర్జీలకు విరుగుడు ఎలర్జన్ ఇమ్యూనోథెరపీ అని డాక్టర్ వ్యాకరణం తెలిపారు. కొవిడ్ వైరస్‌తో రోగనిరోధకశక్తిలో మార్పులు వస్తున్నాయని, అత్యధికంగా హిష్టమైన్ రక్తంలో ఉత్పత్తి అవుతున్నదని దీనివల్ల ఎలర్జీలు పేట్రేగుతున్నాయని వెల్లడించారు.