ICT staff | హైదరాబాద్, జనవరి6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని గురుకులాల్లో పనిచేస్తున్న 39మంది ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. సొసైటీ ఉన్నతాధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 238 గురుకులాల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య బోధనకు ఔట్సోర్సింగ్, హానరోరియం వేతనాలపై గతంలోనే ఐసీటీలను నియమించారు.
తాజాగా ఐసీటీలకు నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. అందులో 39మందికి కనీస నైపుణ్యాలు లేవని తేలగా, వారిని పూర్తిగా తొలగిస్తున్నట్టు సొసైటీ ప్రకటించింది. ఏండ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న తమను అర్ధాంతరంగా తొలగించడం దారుణమని బాధిత ఐసీటీలు మండిపడుతున్నారు. తమకు రావాల్సిన 3నెలల వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.