హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) నిధులు పక్కదారి పట్టాయి. సోషల్ ఆడిట్ నివేదికలో ఈ విషయం తాజాగా వెల్లడైంది. రికవరీ కూడా అంతంత మాత్రంగానే చేసినట్టు తేలింది. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద 2024-25 సంవత్సరంలో కోట్లాది రూపాయల పనులు చేపట్టారు. దేశవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రంలో రూ.రూ.24,55,14,727 నిధులు దుర్వినియోగం అయినట్టు టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) వెల్లడించింది.
ఈ నిధుల్లో కేవలం రూ.6,22,079ను (0.25%) మాత్రమే రికవరీ చేసినట్టు తెలిపింది. నిధుల దుర్వినియోగం విషయంలో 5,985 మందికి హెచ్చరిక నోటీసులు జారీచేయగా, 49 మంది ఉద్యోగులకు జరిమానాలు విధించినట్టు ఏటీఆర్ వెల్లడించింది. పథకంలో అవకతవకలు, అక్రమాలపై 3.12 లక్షల ఫిర్యాదులు రాగా, 5,837 ఫిర్యాదులు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో రూ.2.34 కోట్లు, వికారాబాద్ జిల్లాలో రూ.2.09 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో రూ.1.51 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.1.46 కోట్ల నిధులు పక్కదారి పట్టినట్టుగా ఏటీఆర్ వివరించింది. ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఇంకా రూ.1.50 కోట్ల నిధులు చెల్లించాల్సి ఉన్నట్టు తెలిపింది.
నిబంధనల ఉల్లంఘన
2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ఉపాధి హామీ పనులపై ప్రజల నుంచి 18,207 ఫిర్యాదులు అందగా, 200 ఫిర్యాదులను పరిష్కరించినట్టు డీటీఆర్లో వెల్లడించారు. పనిచేసే సమయంలో నిబంధనల ఉల్లంఘన (ప్రొసెస్ వాయిలేషన్స్)పై 2,05,599 ఫిర్యాదులు అందాయి. చెరువుల్లో పూడికతీసే సమయంలో, తీసిన తర్వాత గోతుల ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఇలాంటి వాటిని పాటించకపోవడంపై ఫిర్యాదులు అందగా, వీటిలో 4,626 ఫిర్యాదులనే అధికారులు పరిష్కరించారు. చేపట్టిన పనుల కొలతల్లో తేడాలపై 59,696 ఫిర్యాదులు అందగా, కేవలం 587 ఫిర్యాదులనే పరిష్కరించారు. నిధులు దుర్వినియోగం, ఇంకుడు గంతలు, మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలపై 29,269 ఫిర్యాదులు అందాయి. వీటిలో 424 మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇలా మొత్తం నాలుగు విభాగాల్లో 3,12,771 ఫిర్యాదులు అందగా, వీటిలో 5,837 మాత్రమే పరిష్కరించినట్టు డీటీఆర్ నివేదికలో వెల్లడించారు.