(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం స్పీకర్‌కు సూచించింది. ఈ క్రమంలో ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 10వ షెడ్యూల్ ప్రకారం.. స్పీకర్ ఒక ట్రిబ్యునల్ అని, ఆ సందర్భంలో రాజ్యాంగపరంగా రక్షణ ఉండబోదని కోర్టు తెలిపింది. దీంతో ఏమిటీ ట్రిబ్యునల్? రాజ్యాంగపరంగా ఏ రక్షణ గురించి కోర్టు వ్యాఖ్యానించింది? అన్న చర్చ జరుగుతున్నది.
రాజ్యాంగం ప్రకారం.. చట్టసభకు అధ్యక్షుడు స్పీకర్. చట్టసభ లోపల జరిగే అన్ని కార్యకలాపాలపై కూడా ఆయనదే అంతిమ నిర్ణయం. స్పీకర్ నిర్ణయాలపై న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోలేవు. స్పీకర్ రాజ్యాంగపరమైన ప్రత్యేక హక్కులు కలిగి ఉండటమే ఇందుకు కారణం. అయితే.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం.. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకొనే సందర్భంలో మాత్రం స్పీకర్‌ను క్వాజీ-జ్యుడీషియల్ అథారిటీ (ట్రిబ్యునల్)గా వ్యవహరిస్తారు. అంటే న్యాయస్థానానికి దాదాపుగా సమానమైన హోదా స్పీకర్‌కు ఈ సందర్భంలో వర్తిస్తుంది.
పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం విషయంలో ఎప్పుడైతే స్పీకర్‌ను.. ‘ట్రిబ్యునల్’గా వ్యవహరిస్తున్నారో.. ఆ సమయంలో వెలువడే నిర్ణయాలపై న్యాయ సమీక్షకు అవకాశం లభిస్తుంది. అంటే.. ఫిరాయింపుదారులపై స్పీకర్ తీసుకొనే నిర్ణయాలపై కోర్టులు సమీక్ష చేయవచ్చు. ఈ సందర్భంలో (ఇప్పుడు మాత్రమే) ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్న స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండబోదు. చట్టసభల్లో సాధారణ సమయాల్లో స్పీకర్ తీసుకొనే నిర్ణయాలే ఫైనల్ అయినట్టు.. ఈ సందర్భంలో ఉండదు. స్పీకర్ తీసుకొనే నిర్ణయంపై ఈ విషయంలో కోర్టులు న్యాయసమీక్ష చేసే అవకాశాన్ని కలిగి ఉంటాయి.
1993లో ‘కిహాట హాల్లోహాన్ వర్సెస్ జాచిల్హూ’ కేసులో సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతలను ప్రకటించడంలో స్పీకర్‌దే తుది నిర్ణయంగా ఉన్నప్పటికీ.. స్పీకర్ నిర్ణయంపై మళ్లీ న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొన్నది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడం రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం ఆ సందర్భంగా గుర్తుచేసింది. ‘రాణాజిత్ ముఖర్జీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో, డీసీ వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటుపై స్పీకర్ తీసుకొన్న నిర్ణయాన్ని న్యాయసమీక్ష చేయవచ్చని వెల్లడించింది. ఈ సమయంలో స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ ఉండబోదని తేల్చిచెప్పింది.
చట్టసభల పవిత్రతను ఇనుమడింపజేసే సదుద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పును అసెంబ్లీ స్పీకర్ శిరసావహించాలి. దేశ ప్రజాస్వామ్య సౌధం దేదీప్యమానంగా వెలగాలన్నదే ఈ తీర్పులోని అంతర్యం. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం.
-శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సుప్రీం తీర్పుతో రాష్ట్రంలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పును కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీ నుంచి ఆయన ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది చారిత్రాత్మకమైన తీర్పు అని పేర్కొన్నారు. ఒక పార్టీ బీ ఫారంపై గెలిచిన ఎమ్మెల్యేలు, మరో పార్టీకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏండ్ల పాటు నాన్చడాన్ని న్యాయమూర్తులు తప్పుబట్టినట్టు తెలిపారు.
పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం హర్షణీయం. మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం గొప్ప నిర్ణయం. ఇప్పటికైనా కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి విధానాలతో వ్యవహరించడం మానుకోవాలి. తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్య పద్ధతులు పాటించాలి. అనర్హులపై వెంటనే వేటు వేయాలి. ఈ తీర్పును అసెంబ్లీ స్పీకర్ వెంటనే అమలు పరుస్తారని ఆశిస్తున్నాం.
-జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరడాన్ని.. ఆ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం సిగ్గుచేటు. ఇదంతా రాహుల్‌కు కనిపించడం లేదా? సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. రాహుల్‌పై, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం గౌరవం ఉన్నా.. వెంటనే ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి.
-మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కోరారు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలపై శ్వేతపత్రం విడుదల చేసి కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ జనహితమా.. ప్రజలను మోసం చేయడానికా..? అని అయన ప్రశ్నించారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తేతెలంగాణ): ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిందని, అయితే చట్టంలోని లోసుగుల కారణం గా అది సాధ్యమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్రకార్యాలయం మగ్దుంభవన్‌లో గురువారం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన వారిపై తక్షణమే అనర్హత వేటు పడేలా చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రకారం కేంద్రం బీసీలకు తక్షణమే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయక తప్పదని బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్‌రావు స్పష్టంచేశారు. తద్వారా ఉప ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అనంతరం గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఫిరాయింపులపై మొదటి నుంచి తాము ఏం వాదించామో, ఆ ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల్లోనే ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ ముగుస్తుందని, అంతకుమించి సమయం కావాలంటే అందుకు తగిన సాక్ష్యాలు, ఆధారాలు చూపాల్సి ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వేళ విచారణకు ఎమ్మెల్యేలు సహకరించకపోతే, తగిన విధంగా స్పందించే అవకాశం ఉందని హెచ్చరించారు.