హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఈగిల్ ఫోర్స్, ఆర్ఎన్సీసీ ఖమ్మం, చౌటుప్పల్ పోలీసులు ఛేదించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో రూ.10.25 లక్షల విలువైన 20.5 కిలోల గంజాయితోపాటు ఓ కారు, మూడు మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 26న రాత్రి ఒడిశా నుంచి కారులో గంజాయి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు ఈగిల్ ఫోర్స్‌కు సమాచారం రాగా నిరంతరం పర్యవేక్షించాయి.
నిందితులు విశాఖపట్నంలోని సబ్బవరం వద్ద ఆగస్టు 27న బయలుదేరి రాజమండ్రి, ఖమ్మం, సూర్యాపేట మార్గంలో ప్రయాణించారు. ఖమ్మం ఆర్ఎన్సీసీ బృందం ఈ వాహనాన్ని గుర్తించి టాస్ఫోర్స్కు సమాచారం ఇచ్చారు. ఈగిల్ ఫోర్స్, ఎస్టీఎఫ్, చౌటుప్పల్ పోలీసులు పంతంగి టోల్‌ప్లాజా దాటిన వెంటనే కారును అడ్డుకుని, ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన త్రిలోచన్ సమంత్ర, అతని మేనల్లుడు సాగర్బాల్ను అదుపులోకి తీసుకున్నారు.